Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తులు.. 31న ప్రమాణం!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని కొలీజియం సిఫారసు చేసిన తొమ్మిది న్యాయమూర్తుల పదోన్నతికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వారి పేర్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపింది. ఆయన కూడా ఆమోదం తెలిపారు. ఆగస్టు 31న వీరి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశముంది. దీంతో సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిని సమీప భవిష్యత్‌లో చూడటానికి వీలుకలిగింది.
 

supreme court, judges, oath, clear, collegium, president, approval, elevation
Author
New Delhi, First Published Aug 26, 2021, 12:33 PM IST

న్యూఢిల్లీ: తొమ్మిది మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందడానికి లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన తొమ్మిది మంది న్యాయమూర్తుల పేర్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వారి పేర్లను ఆమోదించడానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోదించడంతో తరువాత వారి ప్రమాణ స్వీకారమే మిగిలి ఉన్నది. ఈ నెల 31వ తేదీన సుప్రీంకోర్టు నూతన తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశమున్నట్టు సమాచారం.

సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ సారథ్యంలోని కొలీజియం వీరి పేర్లను సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి తొమ్మిది మంది పేర్లను సుప్రీంకోర్టుకు సిఫారసు చేయడం బహుశా ఇదే తొలిసారి. గత సీజే ఎస్ఏ బాబ్డే హయాంలో ఒక్కరినీ సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించలేదు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు అవకాశముంది. కానీ, ఇప్పుడు 24 మంది మాత్రమే ఉన్నారు.

తొలి మహిళా సీజే..

ఈ తొమ్మిది మందిలో కర్ణాటక హైకోర్టు నుంచి పదోన్నతి పొందుతున్న జస్టిస్ బీవీ నాగరత్న 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఆమెనే తొలి మహిళా సీజేగా రికార్డు తిరగరాయనున్నారు. ఇప్పటి వరకు భారత న్యాయవ్యవస్థలో ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించలేదు. జస్టిస్ బీవీ నాగరత్న ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన మాజీ సీజే ఈఎస్ వెంకటరామయ్య కూతురు. 1989 జూన్ నుంచి అదే ఏడాది డిసెంబర్ వరకు ఆయన సీజేఐగా కొనసాగారు. ఆమె కూతురు జస్టిస్ బీవీ నాగరత్న కూడా సీజేఐగా బాధ్యతలు తీసుకోవడానికి అవకాశాలున్నాయి. 1962 అక్టోబర్ 30న జన్మించిన జస్టిన్ నాగరత్న 1987 అక్టోబర్ 28న అడ్వకేట్‌గా బెంగళూరులో ఎన్‌రోల్ అయి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2008 ఫిబ్రవరి 18న కర్ణాటక హైకోర్టుకు జస్టిస్ బీవీ నాగరత్న అదనపు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. 2010 ఫిబ్రవరి 17న శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 

అలాగే, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నుంచి పీఎస్ నరసింహాను నేరుగా సుప్రీంకోర్టుకు తీసుకుంటున్నారు. అంతేకాదు, ఈయన కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించే అవకాశముంది. ఇలా బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు ఎంపికై సీజేగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తిగా నరసింహా రికార్డుల్లో నిలవనున్నారు.

ఆ తొమ్మిది మంది వీరే..
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రామణ సారథ్యంలోని కొలీజియం సిఫారసు చేసిన తొమ్మిది మంది వీరే.. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఎస్ ఓకా, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్, సిక్కిం చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణ చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి‌లతోపాటు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న, కేరళ హైకోర్టు జడ్జీ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు జడ్జీ ఎంఎం సుంద్రేశ్, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బేలా ఎం త్రివేది, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహాలు ఈ జాబితాలో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios