మద్యం పాలసీపై స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానానికి అనుమతులిచ్చింది. కన్వెన్షన్ సెంటర్లు, కల్యాణ మండపాలు, బ్యాంక్వెట్ క్రీడా మైదానాలు, సమావేశ మందిరాలతోపాటు ఇళ్లల్లో చేసుకునే వేడుకల్లో మద్యం సేవించాలంటే..  ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాలని స్టాలిన్ ప్రభుత్వం ఆదేశించింది. 

లిక్కర్ పాలసీపై తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రీడా మైదానాలతో పాటు పలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కన్వెన్షన్ సెంటర్లు, సమావేశ మందిరాలు, సమావేశ కేంద్రాలు, కళ్యాణ మండపాలు, బాంకెట్ హాల్స్, క్రీడా మైదానాలు, కుటుంబ కార్యక్రమాలలో అతిథులకు మద్యాన్ని అందించాలంటే.. ప్రత్యేక లైసెన్స్‌ విధానాన్ని తప్పనిసరి చేసింది.

ఈ మేరకు తమిళనాడు లిక్కర్ పాలసీ (లైసెన్స్ అండ్ పర్మిట్) 1981లో సవరణలు చేసింది. తాజాగా చేసిన సవరణల ప్రకారం.. ఇళ్లలోని విందులు,వేడుకలు సహా వాణిజ్యేతర ప్రదేశాలలో నిర్వహించే కార్యక్రమాల్లో మద్యం సేవించాలంటే.. లైసెన్స్‌ తీసుకోవాలని కండీషన్ పెట్టింది స్టాలిన్ సర్కార్. 

నూతన లిక్కర్ పాలసీ ప్రకారం.. సంవత్సరానికి లైసెన్స్‌ అనుమతుల కోసం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో లక్ష రూపాయలు, మున్సిపాలిటీల్లో 75,000, ఇతర ప్రాంతాల్లో 50,000 వరకు చెల్లించాల్సి ఉంటుందని సర్కార్ తెలిపింది. ఒక రోజుకు అయితే.. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 11,000, మున్సిపాలిటీల్లో 7500, ఇతర చోట్ల 5000 చెల్లించాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు మద్యం విక్రయాలను అరికట్టాలని ప్రయత్నిస్తే.. స్టాలిన్ తీసుకున్న నిర్ణయం మాత్రం హాట్ టాఫిక్ గా మారింది.

తమిళనాడు మాజీ సీఎం జయలలిత తన హయంలో అక్రమ మద్యపాన నిషేధ చర్యలను తీసుకున్నారు. 2016లో 500 మద్యం షాప్‌లను మూసివేయించారు. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల సమయాన్ని కూడా తగ్గించారు. జయలలిత తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన పళని స్వామి కూడా ఆమె మార్గంలోనే నడిచారు. ఆమె అనుసరించిన విధానాలనే అనుసరించారు. 2017లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే 500 మద్యం దుకాణాలను మూసివేయించారు. తాజాగా స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

లిక్కర్ పాలసీలో స్టాలిన్ తీసుకొచ్చిన మార్పులపై ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు స్టాలిన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. తాము మద్య నిషేధం కోసం పని చేస్తే.. స్టాలిన్ మాత్రం మరింత విస్తృతం చేస్తున్నారని.. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే.. స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే సమర్ధిస్తున్నారు.