కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం కేవలం పార్టీకే కాకుండా.. దేశ ప్రజాస్వామ్యానికి, సమాజానికి కూడా అవసరమని సోనియా గాందీ వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం కేవలం పార్టీకే కాకుండా.. దేశ ప్రజాస్వామ్యానికి, సమాజానికి కూడా అవసరమని సోనియా గాందీ వ్యాఖ్యానించారు. మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ ప్రసంగించారు. పార్టీలో ఐక్యత అత్యంత ప్రధానమని సోనియా పేర్కొన్నారు. పార్టీలోని అన్ని స్థాయిలో నేతలు, కార్యకర్తలు ఐక్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లే మార్గం గతంలో కంటే చాలా సవాలుతో కూడుకుని ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడంలో.. కార్యకర్తల శక్తికి, స్ఫూర్తికి ప్రస్తుత పరిస్థితి కఠిన పరీక్ష అన్నారు . 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ విభజన అజెండా క్రమంగా ప్రతి రాష్ట్రంలోనూ సాధారణ రాజకీయ అంశంగా మారుతోందన్నారు. ఈ అజెండా కోసం చరిత్రను, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై కూడా ఈ సందర్భంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బాధను, దిగ్భ్రాంతిని కలిగించాయని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ ఫలితాలతో ఎంతటి నిరాశకు గురయ్యారో తనకు తెలుసని అన్నారు. 

పార్టీ పనితీరును సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైందని తెలిపారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానికి సబంధించి అనేక సూచనలు అందాయని చెప్పారు. అందులో చాలా వరకు సందర్భోచితంగా ఉన్నాయని.. వాటిపై పార్టీ పనిచేస్తోందని సోనియా గాంధీ పేర్కొన్నారు. చింతన్‌ శివిర్‌ను నిర్వహించడం కూడా చాలా అవసరమని తెలిపారు. ఇందులో పెద్ద సంఖ్యలో పార్టీ ప్రతినిధులు, సహచరుల నుంచి అభిప్రాయాలు వినేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం పార్టీ ముందు ఉన్న సవాళ్లను ఎదుర్కోవడానికి పార్టీ తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ముందుకు తీసుకురావడానికి వారు సహకరిస్తారని చెప్పారు. 

దేశంలోని MSMEలు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయని.. బీజేపీ రైతులకు చేసిన వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితులు కనిపించడం లేదని సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వంటగ్యాస్, నూనె, పెట్రోల్, డీజిల్, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు భరించలేని విధంగా పెరిగాయని.. ఇంకా పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా Mehngai-mukt Bharat ప్రచారాన్ని కొనసాగించాలని అన్నారు.

యూపీఏ ప్రభుత్వంలో అమ‌ల్లోకి వ‌చ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని సోనియా గాంధీ అన్నారు. ఇవి ప్రజలకు రక్షణగా నిలిచినందుకు తాను సంతోషిస్తున్నానని చెప్పారు. విపక్షాలను, విపక్ష నేతలను అధికార పక్షం వేధిస్తోందని సోనియా గాంధీ ఆరోపించారు. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారికి గరిష్ట పాలన అంటే.. ప్రత్యర్థులను గరిష్ఠ భయానికి, బెదిరింపులకు గురిచేయడమేనని విమర్శించారు. అలాంటి కఠోర బెదిరింపులు, ఎత్తుగడలు తమని భయపెట్టలేవని పేర్కొన్నారు. 

ఇక, ఐదు రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత జరుగుతున్న తొలి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, పార్లమెంట్ ఉభయ సభల్లోని పార్టీ ఎంపీలందరూ హాజరయ్యారు.