ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బాగా కుంగతీసినట్లు అనిపిస్తోంది. అన్ని బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీని నియమించాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి ఆ బాధ్యత రాహుల్ తీసుకోవాలి. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ ససేమిరా అంటున్నారు. దీంతో... సోనియా గాంధీ ఆ బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగబోనని రాహుల్‌ గాంధీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన సీపీపీ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సమావేశానికి లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్ సభ్యులు, 50మంది రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. 

ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్‌కు 52 మంది ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఇంకా ముగ్గురు సభ్యుల మద్దతు కావాలి. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టే అంశంపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరిగింది. రాహుల్ అభ్యంతరం చెప్పడంతో... సోనియాని రంగంలోకి దించాలని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు.