నవ మసాలు కడుపున మోసి పెంచిన తల్లిని అతి కిరాతకంగా పొట్టనపెట్టుకున్నాడు ఓ కిరాతకుడు. తల్లిని కత్తితో పలుమార్లు పొడిచి చంపేశాడు. అనంతరం ఆమె రక్తాన్ని తీసుకొని తన ముఖానికి, శరీరానికి పూసుకున్నాడు. ఈ దారుణ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీకి చెందిన అంజలి(45) ఆమె కుమారుడు సాగర్(22)లు లాక్ డౌన్ కి ముందు మందనగిరి ఏరియాలోని ఓ ఇంట్లో అద్దెకు వచ్చారు. ఆ ఇంట్లో తల్లీ, కొడుకులు మాత్రమే ఉండేవారు. చాలా కామ్ గా తమ పని తాము చూసుకుంటూ ఉండేవారు. ఇరుగు, పొరుగు వారితో కూడా పెద్దగా కలిసేవారు కాదు. కాగా.. సాగర్ ఓ నైట్ క్లబ్ లో డీజేగా పనిచేస్తున్నాడు.

కాగా.. సోమవారం సడెన్ గా వారి ఇంట్లో నుంచి గట్టిగా అరుపులు వినిపించాయి. ఏం జరిగిందా అని స్థానికులు పరుగున వెళ్లి చూడగా..  సాగర్.. తన తల్లి అంజలిని కత్తితో పొడుస్తూ కనిపించాడు. ఆ సంఘటన చూసి స్థానికులు భయపడిపోయారు. వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు.

అయితే.. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి కొద్దిగా ఆలస్యం అయ్యింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలోనే ఆమె కన్నుమూశారు. కాగా.. తల్లి రక్తాన్ని ఒంటికి, ముఖానికి పూసుకుంటూ.. సాగర్ సైకో మాదిరి ప్రవర్తించడం గమనార్హం.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాగర్.. తల్లిని ఎందుకు చంపాడు అన్న విషయం మాత్రం తెలియరాలేదు. విచారణ లో అన్ని విషయాలు తెలుసుకుంటామని పోలీసులు చెప్పారు.