ప్రధాని నరేంద్ర మోడీ కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. ప్రధాని మోడీ సహా 58 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా, 9 మంది స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 24 మంది సహాయ మంత్రులు.

శుక్రవారం సాయంత్రం మోడీ-2 కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. మంత్రివర్గంలో స్థానం దొరికిన వాళ్లు సంబరాలు చేసుకుంటుండగా.. దొరకనివారు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఇక నరేంద్రమోడీ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలు స్మృతీ ఇరానీయే.. ఆమె వయసు 43 ఏళ్లు.. ఇక పెద్ద వయసు ఉన్న వారిలో రాంవిలాస్ పాశ్వాన్, ఆయన వయస్సు 73 సంవత్సరాలు. ఇక మోడీ తొలి కేబినెట్‌లో మంత్రివర్గంలో మంత్రుల సగటు వయసు 62 సంవత్సరాలు.

అయితే ఈ దఫా మాత్రం 60 ఏళ్లే. 65 ఏళ్లు పైబడ్డ సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం, 50 ఏళ్లలోపు ఉన్న పలువురికి స్థానం కల్పించడంతో సగటు వయసు తగ్గింది. గత మంత్రివర్గంలో అనుప్రియ పటేల్ పిన్న వయస్కురాలిగా రికార్డుల్లోకి ఎక్కారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు.