న్యూఢిల్లీ: భారత ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొత్త మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. మోడీ కొలువులో కొత్తగా కొలువుదీరబోయే నాయకులకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఫోన్లు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకల్లా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రావాలని ఆయన చెబుతున్నారు. 

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.... నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, సదానంద గౌడ, అర్జున్ మేఘవాల్, కిరణ్ రిజిజు, రవి శంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్, రామదాస్ అథవాలే, జితేందర్ సింగ్, సురేష్ అంగాడి, బాబుల్ సుప్రియో, కైలాష్ చౌధురి, ప్రహ్లాద్ జోషీ, జి. కిషన్ రెడ్డిలకు అమిత్ షా ఫోన్లు చేశారు. 

మిత్రపక్షాల్లో శివసేన నుంచి అరవింద్ సావంత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రతి మిత్రపక్షం నుంచి ఒక్కరేసి మంత్రులు ఉంటారని శివసేనకు చెందిన సంజయ్ రౌత్ చెప్పారు. 

అకాలీదళ్ నుంచి హర్ సిమ్రాత్ కౌర్ మంత్రివర్గంలో చేరుతారని తెలుస్తోంది. అన్నాడియంకె నుంచి రాజ్యసభ సభ్యుడు వైతిలింగం మోడీ మంత్రివర్గంలో చేరే అవకాశాలున్నాయి. నరేంద్ర మోడీ సాయంత్రం 7 గంటలకు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

సుష్మా స్వరాజ్ ప్రధాని కార్యాలయం (పిఎంవో) నుంచి కాల్ వచ్చింది. గుజరాత్ రాజ్యసభ సభ్యులు పర్సోత్తమ్ రుపాలా, మన్సుఖ్ ఎల్. మాండవియా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నరాు. జితేందర్ సింగ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలకు కూడా పిఎంవో నుంచి కాల్స్ వచ్చాయి. రాం విలాస్ పాశ్వాన్ కూడా మోడీ మంత్రివర్గంలో చేరనున్నారు. కృష్ణపాల్ గుర్జార్ కు కూడా పిలుపు వచ్చింది. నితిన్ గడ్కరీ కూడా మోడీ మంత్రివర్గంలో చేరనున్నారు.