కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృత్యువాత పడింది. ఇది నెలలో రెండో మరణం. ఆదివారం ఉదయం తీవ్ర నీరసంతో కనిపించిన చిరుత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మరణించిందని అటవీశాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృత్యువాత పడింది. ఆదివారం ఉదయం అనారోగ్యానికి గురైన ఆరేళ్ల చిరుత పులి.. సాయంత్రం మరణించింది. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మన దేశానికి తరలించుకువచ్చిన 12 చిరుత పులుల్లో మరణించిన చిరుత ఒకటి.
సాధారణంగా రోజు నిర్వహించే చెకప్‌లో ఆరేళ్ల ఉదయ్ నీరసంగా కనిపించింది. తడబడుతూ నడిచినట్టు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రకటనలో వెల్లడించింది. ఉదయం 11 గంటలకు మరోసారి చికిత్స ఇచ్చారని తెలిపింది. ఆ తర్వాత ఆ ఎన్‌క్లోజర్ నుంచి బటయకు తీసుకెళ్లినట్టు వివరించింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఉదయ్ పేరుతో ఉన్న చిరుత మరణించింది.
మరణానికి గల కరణాలు పోస్టుమార్టం తర్వాత తెలుస్తాయని సీనియర్ ఫారెస్ట్ అధికారి ఒకరు వివరించారు.
దేశంలో అంతరించిపోతున్న పులుల జనాభాను మళ్లీ పెంచుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పులులను తీసుకురావడం మొదలు పెట్టింది. నమీబియా నుంచి 8 పులులను భారత్‌లోకి తీసుకువచ్చారు. వీరిని ప్రధాని మోడీ ఆయన జన్మదినం రోజున విడుదల చేశారు. కాగా, 12 చిరుతలను దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడకు తీసుకువచ్చారు.
ఈ 20 పులుల్లో ఇప్పుడు రెండు మరణించాయి. తాజాగా ఆదివారం సాయంత్రం మరణించగా.. గత నెల కిడ్నీలో ఇన్ఫెక్షన్‌తో ఐదేళ్ల నమీబియా చిరుత మృత్యువాత పడింది.
