రోడ్డు ప్రమాదం ఇద్దరు చిన్నారులను చిదిమేసింది. తమ సోదరుడితో కలిసి ఇద్దరు అక్కాచెల్లెళ్లు రోడ్డు దాటుతుండగా..వేగంగా వస్తున్నా కారు ఒకటి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. వారి సోదరుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని గురుద్వారా నానక్ పియావో సమీపంలోని జీటీ రోడ్డు వద్ద సోమవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన జస్పాల్ సింగ్, అతని భార్య ముగ్గురు చిన్నారులు, వారి ఫ్యామిలీ ఫ్రెండ్ మిలప్ సింగ్ తో కలిసి కారులో వెళుతున్నారు. మార్గమధ్యలో సీఎన్జీ స్టేషన్ ఎదరుగా ఉన్న గురుద్వారా నానక్ వద్ద వారు కారు ఆపారు.

మిలప్ సింగ్.. ఆ ముగ్గురు చిన్నారులను పట్టుకొని రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఓ కారు వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో జస్పాల్ సింగ్ ఇద్దరు కుమార్తెలు( ఒకరికి 7, మరొకరికి 4 సంవత్సరాలు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడు, స్నేహితుడు మిలప్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. ప్రమాదం చేసిన కారును ఇప్పటి వరకు  గుర్తించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం చేసిన వారి గురించి పోలీసులు వెతుకుతున్నారు.