దేశ రాజధాని ఢిల్లీలో అండర్‌ వరల్డ్ రెచ్చిపోయింది. తమ దందాలను అడ్డుకుంటున్నాడనే అక్కసుతో ఢిల్లీలో ఓ ఎస్ఐని దారుణంగా కొట్టి చంపారు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పోలీస్ కమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేస్తున్న రాజ్ కుమార్ ఆదివారం రాత్రి విధులు ముగించుకుని షాదరా జిల్లా వివేక్ విహార్ ప్రాంతం మీదుగా ఇంటికి వెళ్లాడు. అనంతరం భోజనం చేసి ఎప్పటిలాగానే వాకింగ్ చేస్తున్నాడు.

ఇంతలో కొందరు రాజ్‌కుమార్‌తో వాదనకు దిగి అసభ్యకర పదజాలంతో దూషించారు. ఈ క్రమంలో మాటమాట పెరిగిన సదరు వ్యక్తులు ఎస్ఐని తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. దీంతో తనను తాను రక్షించుకునేందుకు ఎస్ఐ స్థానిక పోలీస్ స్టేషన్‌లోనికి పారిపోయారు.

అయినప్పటికీ వదలని దుండగులు రాజ్‌కుమార్‌ను దారుణంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో వారు గ్యాంగ్‌స్టర్స్‌గా గుర్తించారు. మద్యం, అమ్మకాలను వ్యతిరేకించినందుకు వారు తన తండ్రిని చంపేస్తామని ఇప్పటికే పలుమార్లు బెదిరించారని రాజ్ కుమార్ కుమార్తె తెలిపారు.