శ్రద్ధా వాకర్‌ను రంపంతో కోసి.. శరీరాన్ని ముక్కలు చేసిన అఫ్తాబ్.. పోస్టుమార్టంలో సంచలన విషయాలు
New Delhi: శ్రద్ధా వాకర్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా హత్య చేసిన తరువాత ఆమె శరీరాన్ని ఒక రంపంతో ముక్కలు ముక్కలుగా కోసిన్టటు పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో శ్రద్ధావాకర్‌కు చెందిన 23 ఎముకలకు జరిపిన ఆటాప్సీ పరీక్షలలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Shraddha Walker Muder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధా వాకర్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా హత్య చేసిన తరువాత ఆమె శరీరాన్ని ఒక రంపంతో ముక్కలు ముక్కలుగా కోసిన్టటు పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో శ్రద్ధావాకర్‌కు చెందిన 23 ఎముకలకు జరిపిన ఆటాప్సీ పరీక్షలతో తెలిసింది.
వివరాల్లోకెళ్తే.. గత ఏడాది మేలో తన లివ్ ఇన్ పార్టనర్ అఫ్తాబ్ పూనావాలా చేతిలో హత్యకు గురైన శ్రద్ధా వాకర్ శరీర భాగాలు, ఎముకలను కత్తిరించడానికి ఒక రంపంను ఉపయోగించినట్లు శవపరీక్ష నివేదికలో వెల్లడైంది. దర్యాప్తులో భాగంగా ఆమె 23 ఎముకల ఫోరెన్సిక్ విశ్లేషణ నివేదికను ఢిల్లీ పోలీసులు అందుకున్నారు. దీనిని ఆస్టియోలాజికల్ స్టడీ లేదా ఎముక ముక్కల బయోఫిజికల్ స్టడీ అని పిలుస్తారనీ, ఇది ఇలాంటి సందర్భాల్లో పోలీసులకు సహాయపడుతుందని ఐఎఎన్ఎస్ నివేదించింది. పదునైన అంచులు ఉన్న రంపంతో శరీరాన్ని ముక్కలుగా చేయడం, అదే ఆయుధంతో ఆమె ఎముకలను కత్తిరించినట్లు పోస్టుమార్టం నివేదికలో తెలిసింది. మంగళవారం ఎయిమ్స్ లో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం విశ్లేషణలో ఆమె ఎముకలను రంపం సాయంతో కోశారని తేలింది. ఇప్పుడు ఈ నివేదికను సాకేత్ కోర్టుకు సమర్పిస్తాం' అని పోలీసు వర్గాలు తెలిపాయి.
గత నెలలో, మెహ్రౌలీ అటవీ ప్రాంతంతో పాటు గురుగ్రామ్‌లో కిల్లర్ ఆఫ్తాబ్ పూనావాలా ను తీసుకెళ్లి పోలీసులు గుర్తించిన ఎముకలు శ్రద్ధావేనని డిఎన్‌ఎ పరీక్షలో నిర్ధారించింది. వారి ఫ్లాట్‌లో కనిపించిన రక్తపు జాడలు కూడా ఆమెతో సరిపోలాయి. ఆమె తండ్రి నుండి DNA నమూనాలను ఉపయోగించి పరీక్ష జరిగింది. దేశ రాజధానిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లో ఎముకల శవపరీక్ష జరిగింది. మే 18న మెహ్రౌలీలోని తమ అద్దె ఫ్లాట్‌లో వాగ్వాదం తర్వాత శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ పూనావాలా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, తర్వాత వాటిని చాలా రోజుల పాటు నగరం అంతటా పడేశాడు. ఇలా పడేయడానికి ముందు చాలా రోజుల పాటు శరీర భాగాలను తన ఇంటిలోని రిఫ్రిజిరేటర్ లో ఉంచినట్టు పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని నరికివేయడానికి ఉపయోగించిన రంపాన్ని, బ్లేడ్‌ను గురుగ్రామ్‌లోని ఒక భాగంలో పొదల్లో విసిరినట్లు ఆరోపణలు ఉన్నాయి, అయితే దక్షిణ ఢిల్లీలోని డస్ట్‌బిన్‌లో పడవేసినట్లు వర్గాలు తెలిపాయి. అక్టోబరులో ఆమె తండ్రి మహారాష్ట్రలోని వారి స్వగ్రామంలో పోలీసులను ఆశ్రయించడంతో క్రమంగా నేరం వెలుగులోకి వచ్చింది. అఫ్తాబ్ పూనావాలాతో ఆమె మతాంతర సంబంధంపై కలత చెందడంతో తండ్రి, వికాస్ వాకర్, ఆమెతో టచ్‌లో లేడు. డేటింగ్ యాప్‌లో కలుసుకున్న ఈ జంట గత ఏడాది మేలో ఢిల్లీకి మారడానికి ముందు ముంబైకి సమీపంలోని వారి స్వస్థలమైన వసాయ్‌లో కొన్ని నెలలు కలిసి జీవించారు.
కాగా, నిందితుడు 28 ఏళ్ల అఫ్తాబ్ పూనావాలా గతేడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ నెలాఖరులో ఢిల్లీ పోలీసులు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అఫ్తాబ్, తన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను క్షణికావేశంలో చంపినట్లు గతంలో ఢిల్లీ కోర్టుకు తెలిపాడు.
కాగా, శ్రద్ధా వాకర్ తండ్రి, వికాస్ వాకర్ శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సమావేశమై , తన కుమార్తె హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో పురోగతి లేకపోవడం గురించి ఆయనకు తెలియజేశారు. శ్రద్ధా కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిపై దర్యాప్తునకు మహారాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చింది, అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వికాస్ వాకర్ ముంబైలోని ముఖ్యమంత్రి నివాసం వర్ష బంగ్లాలో ముఖ్యమంత్రిని కలిశారు. తులింజ్ పోలీసులు, మాణిక్‌పూర్ పోలీసుల పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ ఇప్పటివరకు సిట్‌ను ఏర్పాటు చేయలేదు.. చర్యలు తీసుకోలేదని వికాస్ వాకర్ ఆరోపించారు.