సీఎంగా కొనసాగాలా ? వద్దా ? అనేది కేజ్రీవాల్ వ్యక్తిగత విషయం - ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో రెండో పిటిషన్ దాఖలైంది. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. సీఎం పదవిలో ఉండాలా ? వద్దా అనేది కేజ్రీవాల్ వ్యక్తగత విషయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని మరో సారి కోర్టు తేల్చి చెప్పింది.
లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. సీఎంగా కొనసాగాలా ? వద్దా అనేది కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయమని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది.
కేజ్రీవాల్ ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తొలగించాలని దాఖలైన ఈ రెండో పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో రాజ్యాంగ అధికారులను సంప్రదించాలని పిటిషనర్ కు హైకోర్టు సూచించింది. కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనాలు జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలని, అయితే అది ఆయన (కేజ్రీవాల్) వ్యక్తిగత నిర్ణయమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
‘మేము కోర్టు.. రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన విధించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?' అని ధర్మాసనం ప్రశ్నించింది. సామాజిక కార్యకర్త, హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు సూచనతో గుప్తా తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ముందు తాను ప్రజెంటేషన్ ఇస్తానని చెప్పారు.
మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వం కొరవడిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి అని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం పనిచేయడం లేదని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించింది. ‘దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ఎల్జీకి ఉంది. ఆయనకు (ఎల్జీ) మా మార్గదర్శకత్వం అవసరం లేదు. చట్టప్రకారం ఏం చేయాలో అది చేస్తారు’ అని కోర్టు పేర్కొంది.
కాగా.. కేజ్రీవాల్ ను సీఎం పదవిని నుంచి తొలగించాలని సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఇలాంటి పిల్ ను మార్చి 28న హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశాన్ని పరిశీలించాల్సిన బాధ్యత కార్యనిర్వాహక, రాష్ట్రపతిదేనని అని తెలిపింది. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోజాలదని కోర్టు స్పష్టం చేసింది.