పదో తరగతి విద్యార్థులు.. ఇంటర్ విద్యార్థిపై దాడి చేసి బట్టలూడదీసి విచక్షణా రహితంగా కొట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది. దిగ్భ్రాంతి కరమైన ఈ ఘటన వివరాల్లోకి వెడితే..

ఘజియాబాద్ లోని ఓ స్కూల్లో పదోతరగతి చదువుతున్న ఓ అమ్మయిని కలవడానికి 12వ తరగతి చదువుతున్న అబ్బాయి తన ఫ్రెండ్స్ తో కారులో వచ్చాడు. అమ్మాయితో మాట్లాడదామని కారులో నుండి దిగగానే అప్పటికే అక్కడ కాపుకాసిన నలుగురు పదోతరగతి విద్యార్థులు అతని మీద దాడికి దిగారు. 

కారులో వచ్చిన అతని స్నేహితులు అడ్డుకున్నా వారిమీదా దాడి చేశారు. బాధితుడి నోట్లో గుడ్డలు కుక్కి అతని కారులోనే దగ్గర్లోని అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ నిందితుడి బట్టలు ఊడదీయించి బెల్టులు, కర్రలతో దాడి చేశారు. దీన్నంతా వీడియో చిత్రీకరించారు.

అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతోపాటు బాధితుడి సోషల్ మీడియా ఎకౌంట్లు కూడా బలవంతంగా  క్లోజ్ చేయించారు. బాధితుడు కలవడానికి వచ్చిన పదో తరగతి అమ్మాయితో సంబంధం ఉందని బలవంతంగా చెప్పించి రికార్డ్ చేశారు. 

వారినుండి ఎలాగో బయటపడ్డ బాధితుడు పోలీసులకు కంప్టైంట్ ఇచ్చాడు. ఆ నలుగురు నిందితులు ప్రీ ప్లాన్డ్ గా ఈ దాడికి తెగబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడు, నిందితులు మైనర్లు కావడంతో సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.