కాంగ్రెస్ కు షాక్.. బీజేపీలో చేరిన ఒలింపిక్ పతక విజేత, బాక్సర్ విజేందర్ సింగ్..

కాంగ్రెస్ నాయకుడు, ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ బీజేపీలో చేరారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న సమయంలో తీసిన ఫొటోలు ఆ సమయంలో వైరల్ అయ్యాయి.

Shock to The Congress. Olympic medallist and boxer Vijender Singh joins BJP..ISR

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు పార్టీలు మారిపోతున్నారు. ఈ రోజు ఓ పార్టీలో ఉన్న నేత, రేపు మరో పార్టీలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి ఓ క్రీడాకారుడు గుడ్ బై చెప్పారు. ఒలింపిక్ పతక విజేత, ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. 

అయితే మథుర నుంచి వరుసగా మూడోసారి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి హేమమాలినిపై విజేందర్ సింగ్ ను కాంగ్రెస్ బరిలోకి దింపవచ్చని గతంలో ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన ఉన్నట్టుండి కాంగ్రెస్ ను వీడి ప్రత్యర్థి పార్టీలో చేరిపోవడంతో సమీకరణలన్నీ మారిపోయాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం తనకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు.

కాగా.. ప్రొఫెషనల్ బాక్సర్ అయిన విజేందర్ సింగ్ ప్రస్తుతం వివిధ దేశాల్లో క్రీడల్లో పాల్గొంటున్నారు. గత వారం ఆయన ‘ఎక్స్’ చేసిన పోస్ట్ లో ‘ప్రజలు ఎక్కడ కోరుకున్నా పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. ఆయన తొలుత మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ లో, ఆ తర్వాత హర్యానాలోని కర్నాల్ జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.

మధ్యప్రదేశ్ లో ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, మీసాలను తిప్పడం ఆ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హరియాణాలో పాదయాత్ర అనంతరం విజేందర్ సింగ్, కాంగ్రెస్ యాత్రకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. అలాగే 'ఏక్ పంచ్ నఫ్రత్ కే ఖిలాఫ్ (ద్వేషానికి వ్యతిరేకంగా పంచ్)' అని కాంగ్రెస్ ట్వీట్ చేయగా.. ఇద్దరూ కెమెరాకు పిడికిలి బిగించిన వీడియోను రాహుల్ గాంధీ, విజేందర్ సింగ్ రీట్వీట్ చేశారు.

కాగా.. హర్యానాలో ఆధిపత్యం చెలాయిస్తున్న జాట్ సామాజిక వర్గానికి చెందిన విజేందర్ సింగ్ చర్య పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో కూడా రాజకీయ ప్రభావం చూపే అవకాశం ఉంది. హరియాణాలోని భివానీ జిల్లాకు చెందిన ఆయన గత లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. కామన్వెల్త్ గేమ్స్ లో రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios