'రాబోయే ఎన్నికల్లో ఆయన దేశ ప్రధాని కాగలదు'
భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి భారతదేశానికి ప్రధాని అయ్యే అర్హత ఉందనీ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం)నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆశ భావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత జోడో యాత్ర సాగుతుంది. ఈ యాత్రకు దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శనివారం రాహుల్ గాంధీతో శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం)నేత, ఎంపీ సంజయ్ రౌత్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనతో కలిసి కాసేపు నడిచారు. ఈ తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనీ, రాహుల్ గాంధీ భారత దేశానికి ప్రధాని కాగలడని అభిప్రాయం వ్యక్తం చేశారు.
శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లో హత్లీ-చాంద్వాల్ మధ్య రాహుల్ గాంధీతో కలిసి జోడో యాత్రలో సంజయ్ రౌత్ పాల్గొన్నారు. దాదాపు 13 కిలోమీటర్లు నడిచారు. రాహుల్ గాంధీ గురించి బీజేపీ తప్పుడు అభిప్రాయాలను వ్యాప్తి చేస్తుందని.. ఈ యాత్ర ఆ అపోహలను తుడిచిపెడుతుందని అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగుతున్న రాహుల్ గాంధీ యాత్ర ఉద్దేశ్యం.. దేశవ్యాప్తంగా నిండి ఉన్న ద్వేషం, భయాన్ని తొలగించడమేనని, ప్రత్యర్థి పార్టీలను తమ పార్టీ బ్యానర్ కింద ఏకం చేయడమే ఆయన లక్ష్యమని సంజయ్ రౌత్ అన్నారు.
జమ్మూలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సైద్ధాంతిక, రాజకీయ విభేదాలను పక్కన పెడితే.. రాహుల్ గాంధీ తన నాయకత్వ పటిమను ప్రదర్శించారనీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి పెద్ద సవాలుగా మారతాడని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ అద్భుతం చేయనున్నారని అన్నారు. కాంగ్రెస్‌పై అధికార బీజేపీ అపోహలను ప్రచారం చేస్తోందని, అయితే.. ఈ యాత్రతో రాహుల్ గాంధీ ఆ అపోహలన్నింటినీ ఛేదిస్తున్నారని అన్నారు.
రాహుల్ గాంధీకి భారత ప్రధాని అయ్యే అర్హత ఉందా? అనే మీడియా ప్రశ్నకు సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఎందుకు కాలేరని అనుకుంటున్నారన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప థర్డ్ ఫ్రంట్ కు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత దేశానికి ప్రధాని కాగలడని అన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అందరూ 3500 కిలోమీటర్లు నడవలేరనీ, దేశం పట్ల ఎంతో అంకితభావం, ప్రేమ అవసరం. ఆయన తన దేశం పట్ల తనకున్న శ్రద్ధను చూపించాడు. ఈ పర్యటనలో తనకు ఎలాంటి రాజకీయాలు కనిపించడం లేదని అన్నారు.
తనకు ప్రధాని కావాలనే ఆసక్తి లేదని గాంధీ స్వయంగా చెప్పారని..అయితే ప్రజలు ఆయనను ఉన్నత పదవిలో చూడాలనుకున్నప్పుడు.. అతనికి మరో ఎంపిక ఉండదని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ ఆలోచనను తోసిపుచ్చిన రౌత్.. దేశంలోని పురాతన పార్టీకి అపారమైన సామర్థ్యం ఉందని, దేశంలోని ప్రతి మూల,మూలలో పార్టీ ఉనికి కలిగి ఉందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు తక్కువ స్థానాలున్నప్పటికీ.. 2024లో ఆ పరిస్థితి పూర్తిగా మారుతుందని ఆయన అన్నారు.