లక్నో: తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేయడానికి ఓ మహిళ ఏకంగా 800కిలోమీటర్లు ప్రయాణించింది. ఇలా బాధితురాలు ఉత్తరప్రదేశ్ నుండి మహారాష్ట్రకు ప్రయాణించి మరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  ఓ యువతి ఉత్తరప్రదేశ్ లోని లక్నో నగరంలో ఉద్యోగం చేస్తూ స్నేహితురాలితో కలిసి వుంటోంది. అయితే తన వద్ద వున్న లక్షన్నర డబ్బును స్నేహితురాలి వద్ద దాచగా ఆమె మోసం చేసింది. దీంతో డబ్బులు ఇప్పించాలంటూ ఇద్దరికీ కామన్ ప్రెండ్ అయిన రాజ్ పాల్ యాదవ్ ను బాధితురాలు  ఆశ్రయించింది. 

అతడు బాధితురాలి సాయం చేస్తున్నట్లు నటించి ఓ రూంలో ఆమెకు ఆశ్రయం కల్పించాడు. ఇదే అదునుగా ఆమెకు మత్తుమందిచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె భయపడిపోయింది. 

ఎలాగోలా అతడి బారినుండి  బయటపడ్డ యువతి లక్నో నుండి మహిరాష్ట్రలోని స్నేహితురాలి వద్దకు చేరుకుని జరిగిన విషయాన్ని తెలిపింది. ఆమె సాయంతో బాధిత మహిళ నాగ్ పూర్ లోనే తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేయగా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని త్వరలో కేసు ఉత్తరప్రదేశ్‌కు బదిలీ చేస్తామని తెలిపారు.