లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ వల్ల లైంగిక నేరాలు, వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని మధ్య ప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. సామాజిక దురాచారాల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణంగా మారిందని చెప్పింది.
లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ వల్ల లైంగిక నేరాలు, వ్యభిచారం పెరిగేందుకు కారణమవుతున్నాయని మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. ఈ సామాజిక దురాచారాల పెరుగుదల దృష్ట్యా లివ్ ఇన్ రిలేషన్ లను ఒక శాపంగా కోర్టు అభిప్రాయపడింది. మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొటున్న 25 ఏళ్ల యువకుడికి ముందస్తు అరెస్టు (యాంసిపేటరీ) బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఓ మహిళపై పదేపదే అత్యాచారం, ఆమె అనుమతి లేకుండా బలవంతంగా అబార్షన్ చేయడం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన కేసులను ఇండోర్ హైకోర్టు బెంచ్‌లోని జస్టిస్ సుబోధ్ అభ్యంకర్ విచారిస్తున్నారు. ఇందులో 25 ఏళ్ల నిందితుడి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయమూర్తి ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 12న జారీ చేసిన తన ఉత్తర్వులో “ ఈ మధ్య కాలంలో లివ్-ఇన్ రిలేషన్ షిప్ వల్ల ఉత్పన్నమయ్యే నేరాల ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుంటే, లివ్-ఇన్ రిలేషన్ షిప్ శాపంగా ఉందని కోర్టు గమనించవలసి వచ్చింది..ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద అందించబడిన రాజ్యాంగ హామీల ఉప ఉత్పత్తి, ఇది భారతీయ సమాజ నైతికతను మింగేస్తుంది. తీవ్రమైన లైంగిక ప్రవర్తనతో పాటు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుంది. దీని వల్ల లైంగిక నేరాలు స్థిరంగా పెరుగుతూ పోతున్నాయి.’’ అని అన్నారు.
లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ వల్ల తలెత్తే సామాజిక రుగ్మతలు, చట్టపరమైన వివాదాలను ధర్మాసనం ఎత్తి చూపింది. ‘‘ రాజ్యాంగం కల్పించిన ఈ స్వేచ్ఛను ఉపయోగించుకోవాలనుకునే వారు వెంటనే దానిని స్వీకరిస్తారు. కానీ దీనికి దాని సొంత పరిమితులు ఉన్నాయని వారికి పూర్తిగా తెలియదు. అది భాగస్వామికి మరొకరిపై ఎలాంటి హక్కులనూ అందించదు.’’ అని చెప్పింది.
ఇదీ కేసు..
25 ఏళ్ల నిందితుడు, బాధిత మహిళ చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే సమయంలో మహిళ రెండు సార్లు గర్భం దాల్చింది. నిందితుడి ఒత్తిడి వల్ల రెండు సార్లు అబార్షన్ కూడా జరిగింది. అయితే వారు కొంత కాలం తరువాత విడిపోయారు. దీంతో ఆ మహిళకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. దీంతో ఆ యువకుడు కోపంతో ఆమెను వేధించడం ప్రారంభించాడు. దీంతో పాటు తన మాజీ ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే వీడియోను ఆ మహిళ అత్తామామలకు కూడా పంపించాడు. దీంతో ఆమె పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించిన డైరీ, ఇతర పత్రాలన్నీ హైకోర్టు పరిశీలించింది.
