సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌కి త్రిసభ్య కమిటీ క్లీన్ చీట్ ఇవ్వడంతో తనకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.. సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ.

కమిటీ తీర్పు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని, తాను భయపడుతున్నట్లే జరిగిందని... ఓ భారతీయ మహిళగా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆమె వ్యాఖ్యానించారు. అయితే తన పోరాటం ఇక్కడితో ఆగిపోలేదని దీనిపై తన న్యాయవాదితో చర్చించి తదుపరి పోరాటానికి సిద్ధమవుతానని ఆమె తెలిపారు.

త్రిసభ్య కమిటీ తీర్పు తనను భయభ్రాంతులకు గురిచేసిందని మహిళ వెల్లడించారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను తాను కమిటీకి సమర్పించినప్పటికీ తనకు అన్యాయం జరిగిందన్నారు.

అంతేకాకుండా ఈ కేసు కారణంగా తాను, తన కుటుంబం తీవ్ర మనోవ్యధకు గురయ్యామన్నారు. ఇప్పటికీ తమ కుటుంబం దాడులకు, వేధింపులకు గురవుతూనే ఉన్నామన్నారు. కాగా జస్టిస్ గొగొయ్ దగ్గర పనిచేసిన మహిళా జూనియర్ అసిస్టెంట్ తనపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది.

ఈ ఆరోపణలపై జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటైంది. 14 రోజుల పాటు కేసును విచారించిన ఈ కమిటీ సదరు మహిలను పలు కోణాల్లో ప్రశ్నించింది.

ఆమె ఇచ్చిన సమాధాలను, వార్తాపత్రికలకు ఇస్తున్న పలు ఇంటర్వ్యూలను పరిశీలించిన మీదట ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సోమవారం నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదికను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ తెలిపారు.