బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో (Bhagalpur district) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తాతర్‌పూర్ పోలీసు పరిధిలో జ్వాలి చక్ గ్రామంలో ఓ ఇంట్లో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది.

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో (Bhagalpur district) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తాతర్‌పూర్ పోలీసు పరిధిలో జ్వాలి చక్ గ్రామంలో ఓ ఇంట్లో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇరుగుపొరుగు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఇంట్లో బాంబులను అక్రమంగా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా అక్కడివారు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. 

భాగల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ మాట్లాడుతూ ‘ప్రమాదం జరిగిన ఇంట్లోని వారు బాణాసంచా తయారీలో నిమగ్నమై ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వీరు అక్రమంగా దేశీయ బాంబులు తయారు చేస్తున్నారు’ అని తెలిపారు. పేలుళ్ల ధాటికి ఆ ఇంటి పక్కనే రెండు, మూడు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు ఆ ఇంట్లో ఉన్నట్టుగా భావిస్తున్నామని తెలిపారు. 

ఇక, మృతులను గణేష్ ప్రసాద్ సింగ్ (60), ఊర్మిళా దేవి (65)గా గుర్తించగా.. మిగిలిన ఐదుగురి వివరాలు ఇంకా తెలియరాలేదు. గాయపడిన ఏడుగురిని భాగల్‌పూర్‌లోని మాయాగంజ్ ఆసుపత్రిలో చేర్పించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సోని కుమారి (30), నవీన్ మండల్ (32), రాహుల్ కుమార్ (20) ఆయేషా కుమారి (25), రింకు కుమార్ షా (30), వైష్ణవి (30), జయ (35)లుగా గుర్తించారు. 

Scroll to load tweet…

పేలుడు పదార్థాల స్వభావాన్ని తెలుసుకోవడానికి క్షతగాత్రుల వాంగ్మూలాన్ని నమోదు చేసే పనిలో ఉన్నామని.. నమూనాలను సేకరించేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని కూడా పిలిపించామని సుబ్రత్ కుమార్ తెలిపారు. పేలుడు చాలా తీవ్రతతో కూడుకున్నదని.. పక్క ఇళ్లలో నిద్రిస్తున్నవారికి కూడా గాయాలయ్యాయని చెప్పారు. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించిందని చెప్పారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు. 

ఇక, శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండొచ్చని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. కుప్పకూలిన భవన శిథిలాలను జేసీబీ సాయంతో తొలగిస్తున్నారు.