ఆస్ట్రాజెనెకా తయారుచేసిన ‘కోవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ 4 కోట్ల డోసులను సిద్ధంగా ఉంచినట్లు భారత్‌కు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ప్రకటించింది.  ప్రస్తుతం, ఈ టీకా తుది ప్రయోగాలను సీరంతో పాటు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కలిసి నిర్వహిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా 15 చోట్ల ప్రయోగాలను కొనసాగిస్తున్నాయి. ఇక మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం 1600 వాలంటీర్ల నమోదు ప్రక్రియను ఈమధ్యే పూర్తిచేసినట్లు సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది.

మరో సంస్థ నోవావాక్స్‌ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ డోసుల తయారీని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సంస్థ‌ వెల్లడించింది. అయితే ఈ‌ వ్యాక్సిన్‌ మాత్రం తుది దశ ప్రయోగాల అనుమతి కోసం ఎదురుచూస్తోంది.

ఈ రెండు వ్యాక్సిన్‌ల ఉత్పత్తి కోసం సీరం ఇనిస్టిట్యూట్‌ ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో.. భారత్‌లో తుది దశ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్న వ్యాక్సిన్‌లలో ఆస్ట్రాజెనెకా ముందున్నట్లు సీరం అభిప్రాయపడింది.

అయితే, ప్రస్తుతం తయారుచేసిన 4కోట్ల వ్యాక్సిన్‌ డోసులు భారత్‌లో సరఫరా చేయడానికేనా? అన్న ప్రశ్నకు మాత్రం సీరం ప్రతినిధులు సమాధానం ఇవ్వలేదు. ఓవైపు కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు, డోసుల తయారీ ముమ్మరం కాగా మరోవైపు వీటి నిల్వపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా ఫైజర్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ను భద్రపరచడానికి -70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అవసరమన్న విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. అభివృద్ధిచెందిన దేశాలతో పాటు అన్ని దేశాలకు ఇది పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.