న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన ‘ఖచ్చితమైన తేదీల షెడ్యూల్’ను ఆమోదించేందుకు పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆగస్టు 28న వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే: ఎంతో ఘన చరిత్ర కలిగిన ఇండియన్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ప్రస్తుతం నాయకత్వ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పగ్గాలను సోనియా గాంధీ చేపట్టి.. తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే, కాంగ్రెస్ లోని పలువురు నాయకులు రాహుల్ గాంధీని పగ్గాలు చేపట్టమని కోరుతున్నారు. ఇదివరకే పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే, రాహుల్ గాంధీ ఇప్పటివరకు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షపదవి, రాహుల్ గాంధీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే. రాహుల్ గాంధీ పాన్ ఇండియా నాయకుడనీ, పార్టీలో దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మరో నాయకుడు ఎవరున్నారని వ్యాఖ్యానించారు.
మీడియా అడిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "మీరు నాకు ప్రత్యామ్నాయం చెప్పండి. అక్కడ ఎవరు ఉన్నారు? (రాహుల్ గాంధీ కాకుండా ఇతర పార్టీలో)" అని ఖర్గే ప్రశ్నించారు. అలాగే, కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీపై ఒత్తిడి తీసుకువస్తామనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరిగి వచ్చేలా చూస్తారని, ఆ పార్టీలో ఆయన తప్ప మరెవ్వరూ పాన్-ఇండియా అప్పీల్ ఉన్నవారు లేరని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని కోరుకునే ఎవరైనా దేశవ్యాప్తంగా తెలిసి ఉండాలనీ, కన్యాకుమారి నుండి కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ నుండి గుజరాత్ వరకు మద్దతు పొందాలని అన్నారు. "ఆయనకు మంచి గుర్తింపు ఉండాలి, మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆమోదయోగ్యమైన వ్యక్తి" అని ఖర్గే అన్నారు. అలాంటి వ్యక్తి రాహుల్ గాంధీ తప్ప.. అంత స్థాయిలో ఉన్న మరో వ్యక్తి పార్టీలో లేరన్నారు. సీనియర్ నేతలంతా సోనియాగాంధీని పార్టీలో చేర్చుకోవాలని, పని చేయాలని ఒత్తిడి చేశారని, రాహుల్ గాంధీని కలిసి వచ్చి పోరాడాలని అభ్యర్థించారని గుర్తు చేశారు.
"మీరు నాకు ప్రత్యామ్నాయం చెప్పండి. అక్కడ ఎవరు ఉన్నారు? (రాహుల్ గాంధీ కాకుండా ఇతర పార్టీలో)" అని ఖర్గే ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఈ పదవిని చేపట్టడానికి ఇష్టపడడం లేదని వచ్చిన వార్తలపై, మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ "పార్టీ కోసం, దేశం కోసం, ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీతో పోరాడటానికి.. పార్టీని నడిపించడానికి బాధ్యతలు స్వీకరించమని అడుగుతామని" అన్నారు. అలాగే, రాహుల్ గాంధీ చేపట్టే “ భారత్ జోడో యాత్ర ” గురించి కూడా ఆయన ప్రస్తావించారు. “ జోడో భారత్ ” కోసం రాహుల్ గాంధీ అవసరం అని అన్నారు. "మేము ఆయనను అడుగుతాము. మేము అతనిని బలవంతం చేస్తాము. (కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరిగి రావాలని) అభ్యర్థిస్తాము. మేము అతని వెనుక నిలబడి, ఆయన నాయకత్వం కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తాము" అని ఆయన అన్నారు.
కాగా, పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన ‘ఖచ్చితమైన తేదీల షెడ్యూల్’ను ఆమోదించేందుకు పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆగస్టు 28న వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆగస్టు 28న మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే ఈ సమావేశానికి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షత వహిస్తారు. రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ అధినేత కావాలని పలువురు నేతలు బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై అనిశ్చితి, ఉత్కంఠ కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండకూడదనే పట్టుదలతో ఉన్నారని పలువురు పార్టీ సన్నిహితులు చెబుతున్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో ఓటమిని చవిచూడడంతో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
