లక్నో: రాత్రికి రాత్రే ఓ ఇంట్లో రెండు బ్యాగుల నిండా బంగారం, నగదు దొరకడంతో ఓ కుటుంబం షాక్ కు గురైంది.ఇది కలా నిజమా అని ఆ కుటుంబం కొద్దిసేపు ఆలోచనలో పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

రాష్ట్రంలోని మీరట్ కు చెందిన వరుణ్ శర్మ అనే వ్యక్తి ఉదయం లేచి చూడగానే తన ఇంటిపై కప్పుపై రెండు బ్యాగులను గుర్తించాడు.ఈ రెండు బ్యాగులను తెరిచి చూస్తే వాటి నిండా బంగారం, డబ్బు ఉంది.  ఈ డబ్బు సంచులు దోపీడికి చెందిందిగా ఆయన భావించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులు ఈ డబ్బు సంచులను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. వరుణ్ శర్మ ఇంటి పక్కనే ఉన్న వ్యాపారవేత్త పవన్ సింఘాల్ కు సంబంధించిన సొత్తుగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు అధికారి దినేష్ బాగెల్ చెప్పారు.

ఈ డబ్బును పవన్ సింఘాల్ ఇంట్లో పనిచేస్తున్న నేపాల్ కు చెందిన రాజు దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన  రాజు సెక్యూరిటీ గార్డు సహాయంతో కలిసి దోపీడీకి పాల్పడ్డారు. 

రెండు బ్యాగుల్లో డబ్బు, బంగారాన్ని పెట్టి వరుణ్ శర్మ ఇంటిపై కప్పుపై దాచారు.సీసీటీవీలో కన్పించకుండా ఉండేందుకు గాను వరుణ్ శర్మ ఇంటిపై కప్పులో దాచిపెట్టారని పోలీసుల విచారణలో తేలింది.