ఎస్‌డీపీఐ జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీని ఈడి అరెస్ట్ చేసింది. బెంగళూరులో ఆయనను అరెస్ట్ చేసి డిల్లీకి తరలించారు. ఇంతకూ ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేసారంటే.. 

MK Faizy Arrest : సోషల్ డొమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. సిషేధిత పిఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) తో ఎస్‌డీపీఐ సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పీఎఫ్ఐతో సంబంధం ఉన్న నల్లధనం కేసులో ఎస్‌డీపీఐ అధ్యక్షుడిని అరెస్ట్ చేసారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఫైజీని అరెస్ట్ చేసినట్లు ఈడి వర్గాలు చెబుతున్నాయి. 

ఎంకే ఫైజీని కర్ణాటక రాజధాని బెంగళూరులో గత సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు ఈడి అధికారులు. బెంగళూరులోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకుని తెల్లవారుజామున డిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఢిల్లీ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు.

పాపులర్ ఫ్రంట్‌తో సంబంధం ఉన్న చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీలతో ఫైజీకి సంబంధం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. గతంలో ఇదే కేసులో పీఎఫ్ఐ నేతలను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించిన తర్వాత రూ.56.56 కోట్ల ఆస్తులను ఈడీ ఇదివరకే స్వాధీనం చేసుకుంది. వివిధ పీఎఫ్ఐ ట్రస్టులు, సంస్థలు, వ్యక్తుల పేర్ల మీద ఉన్న 35 ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

భారతదేశంలోనే కాదు విదేశాల్లో అక్రమంగా నిధులు సేకరించి ఉగ్రవాద కార్యకలాపాలకు పీఎఫ్ఐ నాయకత్వం వహించిందని కేంద్రం ఆ సంస్థను నిషేధించింది. ఐదేళ్లపాటు ఈ సంస్థపై నిషేదం విధించారు. ఇలాంటి నిషేధిత సంస్థతో ఆర్థిక లావాధేవీలు కలిగిఉన్నారంటూ ఎస్‌డీపీఐ అధ్యక్షుడి ఫైజీని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.