రైతు నేతలను చంపేందుకు వచ్చి పట్టుబడ్డానంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన హల్ చల్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. దీనికి తోడు ట్రాక్టర్ ర్యాలీలో తమను చంపేందుకు కొందరు కుట్రపన్నారంటూ రైతు సంఘాల నేతలు ఆరోపించడం దీనికి మరింత బలం చేకూర్చినట్లయ్యింది.

అయితే నిన్న మీడియా ముందు హల్ చల్ చేసిన ఆ వ్యక్తి ఇవాళ యూటర్న్ తీసుకున్నాడు. శుక్రవారం సోనిపట్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చి ఓ వీడియోలో అతడు పూర్తి విరుద్ధంగా మాట్లాడాడు.

తనకు ఏ పాపం తెలియదనీ.. రైతులు ముందుగా రాసిచ్చిన స్క్రిప్టునే తాను మీడియా ముందు చదివానంటూ సదరు వీడియోలో అతడు చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియో అసలైనదా కాదా అనే దానిపై పోలీసులు ధ్రువీకరించలేదు.

కస్టడీలో అతడిని పూర్తిగా విచారించిన తర్వాత తాము మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం హర్యానాలోని సోనిపట్‌ క్రైం బ్రాంచ్ పోలీసులు 21 ఏళ్ల ఆ యువకుడిని ప్రశ్నిస్తున్నారు.

సోనిపట్‌కు చెందిన ఆ యువకుడికి గతంలో నేర చరిత్ర లేదని తెలిపారు. అతడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని.. అంతేకాకుండా ఎంత విచారించినా కుట్రపన్నినట్టు ఎలాంటి ఆధారాలు లభించడం లేదని పోలీసులు తెలిపారు.

కేసులో మరింత పురోగతి కోసం విచారణ కొనసాగిస్తామన్నారు. కాగా శుక్రవారం రాత్రి సింఘు సరిహద్దు వద్ద రైతులు ఓ వ్యక్తిని మీడియా ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే రోజు అతడు, అతడి అనుచరులు పోలీసుల మాదిరిగా నటిస్తూ రైతులపై లాఠీచార్జి జరపాలని చెప్పినట్టు అతడు నిన్న మీడియాతో చెప్పాడు.