కొత్త వ్యవసాయ చట్టాల అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. కొత్త వ్యవసాయ చట్టాలపై స్టే విధిస్తూ ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంది.నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దులో వేలాది మంది రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 

also read:నూతన వ్యవసాయ చట్టాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రైతు సంఘాల మధ్య వాదనలను వినేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది  ఉన్నత న్యాయస్థానం.

 

తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు స్టే కొనసాగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సంప్రదింపులపై అనుకూల, ప్రతికూల వాదనలను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వింటుంది.వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టుకు నివేదిక ఇవ్వనుంది కమిటీ.

సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో ఆశోక్ గులాటీ, హర్‌ప్రీత్ సింగ్ మాన్, ప్రమోద్ కుమార్ జోషీ, అనిల్ ధావంత్ ఉన్నారు.రైతుల ఆందోళనల విషయంలో కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.పూర్తి తీర్పు వచ్చే వరకు చట్టాలపై స్టే వర్తిస్తోందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.