న్యూఢిల్లీ: మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు బుధవారం నాడు స్టే విధించింది. తదుపరి వాదనలు పూర్తయ్యేవరకు మరణశిక్షను నిలుపుదల చేసేలా బుధవారం నాడు ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.ఓ బిల్డింగ్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మోహన్ సింగ్ అనే వ్యక్తి 2019 లో ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య  చేశాడు. ఆమె పొట్టను చీల్చి అవయవాలను బయటకు తీశాడు.

 ఆ తర్వాత ఓ వస్త్రాన్ని పొట్టలో కుక్కి వైరుతో కుట్లు వేశాడు. ఆ తర్వాత ఆధారాలను మాయం చేసే ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు.ఈ కేసులో మోహన్ సింగ్ పై కింది కోర్టు  దోషిగా తేల్చింది. అంతేకాదు అతనికి మరణశిక్షను విధించింది.రాజస్థాన్ హైకోర్టు కూడ ఈ తీర్పును సమర్ధించింది. ఈ ఏడాది ఆగష్టు 9న ఆయనకు శిక్షను ఖరారు చేసింది.

దోషి తరపున సిద్దార్ధ్ లూత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దోషికి విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని కోరాడు.మోహన్ సింగ్ ను ఈ కేసులో ఇరికించారని దోషి తరపు న్యాయవాది వాదించారు. మరణించిన మహిళ చివరి సారిగా మోహన్ సింగ్ తో మాట్లాడిందన్నారు. ఈ కారణంతోనే తన క్లయింట్ ఈ హత్య చేశాడరని నిర్ధారణకు రావడం సరైంది కాదన్నారు. 

ఈ ఘటనలో సీసీటీవీ రికార్డులను పోలీసులు కోర్టుకు సమర్పించలేదన్నారు. అంతేకాదు డీఎన్ఏ నిపుణులు కూడ కోర్టుకు హాజరు కాలేదన్నారు. సరైన ఆధారాలను సమర్పించాలని కోర్టును కోరారు. అప్పటివరకు మోహన్ సింగ్ ఉరిశిక్షపై స్టే విధించాలని కోరారు. దీంతో మోహన్ సింగ్  ఉరిశిక్షపై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం నాడు స్టే విధించింది.