సామాజిక కార్య‌క‌ర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో తీస్తా సెతల్వాద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ.. విచారణకు పూర్తి సహకారం అందించాలని సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోనే ధర్మాసనం కోరింది. 

సామాజిక కార్య‌క‌ర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో తీస్తా సెతల్వాద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ.. విచారణకు పూర్తి సహకారం అందించాలని సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోనే ధర్మాసనం కోరింది. రెగ్యులర్ బెయిల్ అంశాన్ని హైకోర్టు పరిశీలించే వరకు ఆమె పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని కూడా ఆదేశించింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు కల్పిత సాక్ష్యాలను రూపొందించారని తీస్తా సెతల్వాద్‌‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తీస్తా సెతల్వాద్‌ను జూన్ 25న అరెస్టు చేశారు. 

ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తీస్తా సెతల్వాద్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తీస్తా సెతల్వాద్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. తీస్తా సెతల్వాద్ రెండు నెలలకు పైగా కస్టడీలో ఉన్నారని.. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న వాస్తవిక దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న సమయంలో ఆమె మధ్యంతర బెయిల్‌కు అర్హులని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. 

గుజరాత్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఎఫ్‌ఐఆర్‌లో తీస్తా సెతల్వాద్ ప్రమేయాన్ని సూచిస్తూ ప్రచారం చేసిన అంశాలే కాకుండా తగినంత మెటీరియల్‌లు ఉన్నాయని కోర్టుకు సమర్పించారు. తీస్తా సెతల్వాద్‌ దరఖాస్తు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని తుషార్ మెహతా వాదించారు. కాబట్టి ఈ అంశాన్ని హైకోర్టు పరిశీలించేందుకు అనుమతించాలని కోరారు.

ఇక, ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీం ధర్మాసనం ఆమె మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తుది బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని గుజరాత్ హైకోర్టును కోరింది. అయితే ఈలోగా తీస్తా సెతల్వాద్‌ను విడుదల చేస్తారని.. స్థానిక ష్యూరిటీకి పట్టుబట్టకుండా శనివారంలోగా ఆమెను విడుదల చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు సీజేఐ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.