తన గురించి ఎలాంటి సమాచారం ఎవరికీ ఇవ్వొద్దంటూ కర్ణాటక జైళ్ల శాఖకు చిన్నమ్మ శశికళ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో శశికళ.. బెంగళూరులోని పర్పప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. త్వరలోనే ఆమెకు విధించిన శిక్ష కాలం ముగియనుంది. జనవరిలో ఆమె బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. 

శిక్షాకాలం ముగిసిన అనంతరం చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం దాదాపు ఖాయమైంది. జరిమానా రూ.10 కోట్లు ముందుగా చెల్లించాల్సి ఉంది. అందుకే ఆమె ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ బెంగళూరులో ఇప్పటికే తిష్ట వేశాడు.

కాగా.. తన వివరాలను ఎవరుపడితే వారు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటుండడంతో చిన్నమ్మ ఆగ్రహం చెందినట్టు సమాచారం. తన వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని జైళ్ల శాఖకు ఆమె లేఖ రాశారు. విడుదల వ్యవహారం గురించి సమాచారం సేకరించిన వారు, మున్ముందు తన విడుదలకు అడ్డు తగిలేలా కొత్త వివరాల కోసం సమాచార చట్టాన్ని అడ్డం పెట్టుకోవచ్చని భావించి చిన్నమ్మ లేఖ రాసినట్టు అమ్మ శిబిరంలో చర్చ జరుగుతోంది. జైలులో లగ్జరీగా ఉన్నారన్న విషయం ఒకటి ప్రచారం అవుతున్న దృష్ట్యా దీన్ని బూతద్దంలో పెట్టే దిశగా సమాచారం సేకరించే వారు ఉండవచ్చనే ఆమె భావించినట్టు తెలిసింది.