ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. బాగ్ పత్ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేత సంజయ్ ఖోఖర్ ను ముగ్గురు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చారు. కాగా.. ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... మంగళవారం ఉదయం.. తన పోలానికి నడుచుకుంటూ వెళ్తుండగా అతడిపై కాల్పులకు దిగారు. ఈ సంఘటన బాగ్‌పత్ ఛప్రౌలి పోలీస్ స్టేషన్ ప‌రిధిలో చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. 

ఘ‌ట‌న  జ‌రిగి‌న స‌మ‌యంలో సంజయ్ ఖోఖర్ ఒంటరిగా వెళుతున్నార‌ని తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న వెంటనే పోలీసుల‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. విచారణను వేగవంతం చేసి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అధికారులను ఆదేశించారు. కాగా, ఇదే ప్రాంతంలో గత నెలలో రాష్ట్రీయ లోక్‌దళ్‌ నాయకుడు దేశ్‌పాల్‌ ఖోఖర్‌ను కూడా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.