జైపూర్: ఆశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన సచిన్ పైలెట్ రాజీకి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని సచిన్ పైలెట్ వర్గం తీవ్రంగా ఖండించింది.  సచిన్ పైలెట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో జరుపుతున్న చర్చల్లో పురోగతి కన్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  సచిన్ తో వెళ్లిన ఎమ్మెల్యేలు గెహ్లాట్ కు మద్దతిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆశాభావంతో ఉంది.

ముఖ్యమంత్రి పదవి నుండి ఆశోక్ గెహ్లాట్ తప్పుకొంటేనే మద్దతు ఇస్తామని సచిన్ వర్గం తేల్చేసింది. ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ పై ఈ ఏడాది జూలై 12వ తేదీన సచిన్ పైలెట్ తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. 

సీఎల్పీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో సచిన్ పైలెట్ సహా ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చర్యలు తీసుకొంది. జూలై 14వ తేదీన సచిన్ పైలెట్ ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవుల నుండి కాంగ్రెస్ తొలగించింది. 

ఈ నెల 14వ తేదీ నుండి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అసమ్మతి ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. సత్యం పక్షాన నిలవండి- ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం ఆశోక్ గెహ్లాట్ లేఖ రాశాడు.  ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలు, రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేయడానికి ఓటర్ల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.