Asianet News TeluguAsianet News Telugu

Sabarimala darshan: శబరిమలకు వచ్చే పిల్లలకు RT-PCR టెస్ట్ తప్పనిసరి కాదు.. కేరళ సర్కార్ కీలక ఉత్తర్వులు

శబరిమల (Sabarimala) యాత్రకు వెళ్లే చిన్నారులకు కేరళ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి (sabarimala ayyappa darshanam) వెళ్లే పిల్లలకు ఆర్‌టీ పీసీఆర్ (RT-PCR) పరీక్ష తప్పనిసరి కాదని తెలిపింది. 

Sabarimala darshan no RT-PCR test required for children
Author
Thiruvananthapuram, First Published Nov 27, 2021, 5:17 PM IST

శబరిమల (Sabarimala) యాత్రకు వెళ్లే చిన్నారులకు కేరళ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి (sabarimala ayyappa darshanam) వెళ్లే పిల్లలకు ఆర్‌టీ పీసీఆర్ (RT-PCR) పరీక్ష తప్పనిసరి కాదని తెలిపింది. శబరిమల దర్శనానికి వెళ్లే బాల యాత్రికుల విషయంలో నెలకొన్న చిన్నపాటి గందరగోళానికి తెరదించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పిల్లల విషయంలో వారి వెంట వచ్చే పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఆర్టీ-పీసీఆర్‌ లేకుండానే చిన్నారులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కేరళ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. అయితే పిల్లలతో పాటు వచ్చే పెద్దలు.. సబ్బు/శానిటైజర్ ఉపయోగించడం, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం.. వంటి కోవిడ్ నిబంధనలకు పాటించేలా చూసుకోవాలని తెలిపింది. పిల్లల ఆరోగ్య సమస్యలకు పెద్దలు జవాబుదారీగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

శబరిమల మకరవిళక్కు పండుగ 2021-22 సజావుగా సాగడానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, కోవిడ్ నియంత్రణపై రాష్ట్ర ప్రోటోకాల్‌కు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శబరిమలకు వచ్చే యాత్రికులు, సిబ్బందికి తప్పనిసరిగా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా 72 గంటల ముందు ఆర్​టీపీసీఆర్​ నెగెటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఆ ఉత్తర్వుల్లో పిల్లల గురించి ప్రస్తావించలేదు. దీంతో శబరిమల యాత్రకు వచ్చే పిల్లల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 

ఇక, అయ్యప్ప దీక్షలు ధరించిన భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా నవంబర్ 16న శబరిమల ఆలయాన్ని తెరిచిన సంగతి తెలిసిందే. స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం రెండు నెలల పాటు ఆలయం తెరిచే ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే రోజుకు 30 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios