గతేడాది దేశ రాజధాని ఢిల్లీలో 11 మంది కుటుంబసభ్యులు సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతీత శక్తులు, మోక్షం నేపథ్యంలో 11 మంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు వారందరూ దెయ్యాలుగా మారారంటూ వస్తున్న వార్తలు ఢిల్లీలో సంచలనం కలిగిస్తున్నాయి. వీరి మరణానంతరం గతేడాది అక్టోబర్‌లో దినేశ్ చుంద్వాత్ అనే వ్యక్తి బురారీ ఇంటిని కోటిన్నర రూపాయలకు కొనుగోలు చేశాడు.

ప్రస్తుతం డబ్బు అవసరం ఉండటంతో.. ఆ ఇంటిని అమ్మేందుకు బేరానికి పెట్టాడు. అయితే అప్పటికే చనిపోయిన బురారీ కుటుంబసభ్యులు ఆత్మలుగా మారి అదే ఇంటిలో సంచరిస్తున్నారంటూ పుకార్లు వ్యాపించాయి.

దీంతో ఆ ఇంటిని కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు.... దీంతో ఆ ఇంటి యజమానికి ఐడియా తట్టింది. ఈ పుకార్లు నిజం కాదని నిరూపించేందుకు గాను దినేశ్, అలీ అనే వ్యక్తులకు కబురు పెట్టాడు.

వీరిద్దరు ఆ ఇంట్లో నెల రోజుల పాటు గడిపి.. అవన్ని ఒట్టి పుకార్లేనని నిరూపించనున్నారు. దినేశ్ కోరిక మేరకు అలీ సోదరులు ప్రస్తుతం ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు. మూడంతస్థుల ఆ భవనంలో కింది ఫ్లోర్‌ను తమ కార్పెంటర్ విధుల కోసం వాడుకుంటుండగా.. మిగతా రెండతస్తుల్లో వారు నివాసం ఉంటున్నారు.

ఈ విషయం గురించి అలీ సోదరులు మాట్లాడుతూ... తొలి రోజు మేం నారాయణి దేవి రూంలో ఆమె మంచం మీద పడుకున్నామని.. తమకు ఎలాంటి తేడా కనిపించలేదని తరువాత తాము ఇంట్లో ఉన్న వేర్వేరు బెడ్రూమ్‌లలో ఒంటరిగానే పడుకున్నామని చెప్పాడు.

అయితే తాము బురారీ ఇంట్లో ఉండటం తమ కుటుంబసభ్యులకు కూడా ఇష్టం లేదని.. వారు మమ్మల్ని ఇక్కడకు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారని అలీ సోదరులు తెలిపారు. కానీ తాము వాటిని నమ్మమని వారు స్పష్టం చేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఆత్మలు తిరుగుతూ ఉంటాయని తాము బలంగా విశ్వసిస్తామన్నారు.

పుకార్లపై ఆ ప్రాంతంలోని ఓ బ్రోకర్ మాట్లాడుతూ.. ఇలాంటి దారుణాలు జరిగిన ఇళ్లను కొనడానికి జనాలు అంతగా ముందుకు రారని.. ఒక వేళ ఎవరైనా కొందామని భావించినా చాలా తక్కువ రేటుకు అడుగుతారన్నాడు.

బురారీలు చనిపోయిన ఇళ్లు రోడ్డుకు దగ్గరలో ఉందని.. పెయింట్ వేసి.. చిన్న చిన్న మార్పులు చేస్తే, మంచి ధర పలుకుతుందని కానీ ముందు ఆ ఇంటి గురించి ప్రచారం అవుతోన్న పుకార్లలో నిజం లేదని తేలాల్సి ఉందన్నారు.