రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంస్థ నిర్ణయాధికారంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారిస్తుందని ప్రయాగ్‌రాజ్‌లో సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీనియర్ ఆఫీస్ బేరర్ తెలిపారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళా సాధికారత: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో మహిళల పాత్రపై చాలా కాలంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లోని నిర్వంచిన సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీనియర్ కార్యకర్త మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ నిర్ణయాధికారంలో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించాలనీ, వారి ప్రాధాన్యతను మరింత పెంచడంపై దృష్టి పెడుతుందని అన్నారు. అఖిల భారత కార్యనిర్వాహక మండలి సమావేశంలో రెండవ రోజు చర్చలో ఆర్ఆర్ఎస్ దాని అనుబంధ సంస్థలన్నింటిలో మహిళా కార్యకర్తల పాత్రను పెంచడానికి మార్గాలను కనుగొనడంపై దృష్టి సారించిందని తెలిపారు.

సంస్థ చేపడుతున్న వివిధ సామాజిక, సైద్ధాంతిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం ఉండేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని నాయకులు అంగీకరించారని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త తెలిపారు. సామాజిక సమస్యలకు సంబంధించిన పనులను నగర స్థాయి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి బ్లాక్ స్థాయిలో చేపడతామని చెప్పారు. ఇందుకోసం.. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ సభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేయనున్నారు. దేశవ్యాప్తంగా అంగన్‌వాడీలు, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ల నుంచి మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంపై కూడా చర్చ జరిగిందని తెలిపారు.

విద్యార్థినీల సమీకరణ

సంఘ్ కార్యకలాపాలకు బాలిక విద్యార్థులను సమీకరించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయించిందని అధికారి తెలిపారు. విశేషమేమిటంటే.. అక్టోబర్ 5న విజయదశమి సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగంలో మహిళల జ్ఞానం, సాధికారత,నిర్ణయం తీసుకునే ప్రక్రియతో సహా సమాజంలోని అన్ని కార్యకలాపాలలో మహిళలకు సమాన భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.భగవత్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలేతో పాటు రాష్ట్రంలోని 45 ప్రాంతాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు గౌహానియాలో నాలుగు రోజులపాటు జరిగే సమావేశంలో పాల్గొంటున్నారు.