కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై కేంద్రప్రభుత్వం స్పందించింది. జైట్లీ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయనపై వస్తున్న కథనాలు నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి సితాన్షుకర్ ట్వీట్ చేశారు. ‘‘కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్నట్లుగా అరుణ్ జైట్లీ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు అవాస్తవాలు, నిరాధారమైనవి... ఈ పుకార్లపై మీడియా సంయమనం పాటించాలని ట్వీట్ చేశారు.

మరోవైపు జైట్లీ కాలేజీ స్నేహితుడు, మీడియా దిగ్గజం రజత్ శర్మ ఆయన అనారోగ్యంపై వస్తున్న వార్తలను ట్విట్టర్ ద్వారా ఖండించారు. బయటికి వస్తే ఇన్ఫెక్షన్ సోకుతుందనే జైట్లీ ఇంటికే పరిమితమయ్యారని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని రజత్ తెలిపారు. జైట్లీ గత వారమే ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన అనారోగ్యానికి సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.