ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రాజస్తాన్ (Rajasthan) సర్కార్ కీలక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ప్రకటించారు.

ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రాజస్తాన్ (Rajasthan) సర్కార్ కీలక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ప్రకటించారు. అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాలు.. రాజస్తాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్-2021 (REET) లెవెల్-2 పరీక్షను గతేడాది నిర్వహించారు. 6 నుండి 8 తరగతుల విద్యార్థులకు బోధించడానికి ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్ష పేపర్ లీక్ అయినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజస్తాన్ సర్కార్ దర్యాప్తు చేపట్టడానికి Special Operation Group‌ను ఏర్పాటు చేసింది. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 38 మందిని అరెస్ట్ చేసింది. 

ఈ క్రమంలోనే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో REET లెవల్-2 పరీక్షను రద్ద చేయాలని రాజస్తాన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటన చేశారు. మళ్లీ పరీక్షను నిర్వహించనున్నట్టుగా చెప్పారు. లెవల్ -1 పరీక్షలో పేపర్ లీక్ జరగలేదు కాబట్టి దానిని రద్దు చేయడం లేదని తెలిపారు. లెవల్ -2 మాత్రమే తిరిగి నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సారి 32 వేల పోస్టులకు బదులుగా 62 వేల పోస్టులకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. తొలుత అర్హత పరీక్ష నిర్వహించి.. తర్వాత తుది పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించారు. 

ఈ సందర్భంగా బీజేపీపై సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేక అంశాలు లేకపోవడం వల్ల ప్రతిపక్షాలు నిరాశకకు గురవుతున్నాయని అన్నారు. లక్షలాది మంది భవిష్యత్తు పరీక్షతో ముడిపడి ఉన్నందున్న పరీక్షను రద్దు చేయాలనే నిర్ణయంతో తాము సంతోషంగా లేమని అశోక్ గెహ్లాట్ మీడియా సమావేశంలో తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ చేస్తున్న నిరసన రాజకీయాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీఎం గెహ్లాట్ తెలిపారు. పరీక్ష పత్రాల లీక్‌లను అరికట్టేందుకు, పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా కఠిన చర్యలతో కూడిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు. పేపర్ లీక్ కావడం ఇదే తొలిసారి కాదని.. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ముఠాలను కఠినంగా శిక్షించాల్సి ఉందన్నారు. 

రీట్ పేపర్ లీక్‌పై వాస్తవాలను బయటపెడుతున్న బీజేపీ నేతలు.. వారి వద్ద ఇన్ని వివరాలు ఉంటే పరీక్షకు ముందే ప్రభుత్వానికి ఎందుకు తెలియజేయలేదో చెప్పాలని గెహ్లాట్ ప్రశ్నించారు.