సారాంశం

బెంగళూరులో ఓ యువతి ఇంటికి వెళ్లడానికి ర్యాపిడో బైక్ బుక్ చేసింది. రైడర్ మరో బైక్ పై వచ్చి ఆమెను పికప్ చేసుకున్నాడు. దారి మధ్యలో బైక్‌ను సింగిల్ హ్యాండ్‌తో డ్రైవ్ చేస్తూ.. హస్తప్రయోగం చేసుకున్నాడు. వెనుకే ఉన్న యువతి భయంతో వణికిపోయింది. ఆ తర్వాత కాల్ చేయడం, వాట్సాప్‌లో మెస్సేజీలో పెడుతూ వేధించాడు.
 

బెంగళూరు: మహిళలు ఇంటి బయట అడుగుపెడితే ఏదో రూపంలో వేధింపులకు గురవుతున్నారు. చాలా చోట్ల ఇది కనిపిస్తున్నది. ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా కొందరు సైకోల కారణంగా కొన్ని సార్లు ఈ వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. తాజాగా, బెంగళూరులో ఓ యువతిని బైక్ ఎక్కించుకున్న ర్యాపిడో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. వెనుక యువతిని బైక్ పై తీసుకెళ్లుతుండగా.. ఒక చేతితో డ్రైవ్ చేశాడు. మరో చేతితో హస్తప్రయోగం చేశాడు. దీంతో ఆ యువతి కంపించిపోయింది. కానీ, చివరకు ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతి ఏం చేసిందంటే?

ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటున్న అథిర టౌన్ హాల్‌లో మణిపూర్ బాధితులకు సంఘీభావం తెలిపే కార్యక్రమానికి హాజరైంది. శుక్రవారం నాడు.. ఆ సంఘీభావ కార్యక్రమం తర్వాత తిరిగి ఇంటికి వెళ్లడానికి ర్యాపిడో ఆటోలను బుక్ చేసే ప్రయత్నం చేసింది. కానీ, చాలా సార్లు ర్యాపిడో ఆటోలు క్యాన్సిల్ కావడంతో చివరకు ర్యాపిడో బైక్‌ను బుక్ చేసింది. ఓ సన్నపాటి యువకుడు ర్యాపిడోతో రిజిస్టర్ అయినబైక్ కాకుండా మరో బైక్ పై అక్కడికి వచ్చాడు. ఆమె అనుమానంతో బైక్ ఇది కాదని ఆరా తీయగా.. తన బైక్ సర్వీసింగ్ కోసం రిపేర్‌కు ఇచ్చానని, ఇప్పుడు తాత్కాలికంగా ఈ బైక్ ఉపయోగిస్తున్నట్టు వివరించాడు. అయినా.. నమ్మని అథిర ర్యాపిడో యాప్‌లో ఆ రైడ్ చూసి కన్ఫామ్ చేసుకుంది.

ఆ బైక్ ఎక్కింది. ఇంటికి రైడ్ ప్రారంభమైంది. కానీ, దారి మధ్యలో పెద్దగా వాహనాల రద్దీలేని చోటుకు వెళ్లగానే ఆ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బైక్‌ను సింగిల్ హ్యాండ్‌తో డ్రైవ్ చేయడం ప్రారంభించాడు. మరో చేతితో మాస్టర్‌బేట్ చేసుకున్నాడు. ఇది గమనించిన అథిర ఏమీ తెలియనట్టు మిన్నకుండిపోయింది. ఆ కఠిన సమయాన్ని ఆందోళనగా గడిపింది. తన ఇంటి అడ్రెస్ తెలియకుండా 200 మీటర్ల దూరంలోనే బైక్‌ను ఆపాలని కోరింది. ఆన్‌లైన్ పేమెంట్ చేసి దిగి వెళ్లిపోయింది. కానీ, డ్రైవర్ ఆ తర్వాత కూడా హరాస్‌మెంట్ చేయడం ప్రారంభించాడు.

Also Read: Manipur horror: స్వాతంత్ర్య సమరయోధుడి భార్య సజీవ దహనం.. ఆలస్యంగా వెలుగులోకి

తరుచూ కాల్ చేస్తూ.. వాట్సాప్‌లో మెస్సేజీలు పెడుతూ వేధించాడు. ఫోన్‌ నెంబర్ బ్లాక్ చేస్తే వేరే నెంబర్ల నుంచి ఫోన్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె ట్విట్టర్‌లో తాను ఎదుర్కొన్న అవాంఛనీయ ఘటనను వివరించింది. ఆ మెస్సేజీల స్క్రీన్ షాట్ కూడా అప్‌లోడ్ చేసింది. పోలీసులు రియాక్ట్ అయ్యారు. వెంటనే ఆ మూర్ఖుడిని అరెస్టు చేశారు.

తాజాగా, ఈ రోజు మరోసారి అథిర ట్విట్టర్‌ వేదికపై స్పందిస్తూ.. తాను ఈ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు దుండగుడిని అరెస్టు చేసినట్టు వివరించింది. వేగంగా స్పందించినందుకు పోలీసులకు, అండగా నిలిచిన ఇతరులకు ధన్యవాదాలు తెలిపింది.