న్యూఢిల్లీ: బీజేపీయేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడంపైనే కేంద్రం దృష్టి సారిస్తోందని, ప్రజల ప్రశ్నలకు కేంద్రం స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేసీ.వేణుగోపాల్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మెగా ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ ర్యాలీని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆ పార్టీ ప్రధాని కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం ఈ ర్యాలీతో ముగియబోదని ఆయన స్పష్టం చేశారు. మరిన్నికార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. వివరాల్లోకెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిర్వహించబోయే మెగా ర్యాలీకి ముందు కాంగ్రెస్ కేంద్రంలోని బీజేపీ సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. బీజేపీయేతర పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలను కూల్చివేయడంపైనే కేంద్రం దృష్టి సారిస్తోందని, ప్రజల ప్రశ్నలకు కేంద్రం స్పందించడం లేదని కేసీ.వేణుగోపాల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా అత్యంత బాధాకరమైన ధరల పెరుగుదల సమస్యకు వ్యతిరేకంగా పార్టీ వీధుల్లో పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన అన్నారు.
పెరుగుతున్న ధరల కారణంగా సామాన్య ప్రజలు పడుతున్న బాధలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంటూ.. ఆదివారం దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ 'మెహంగై పర్ హల్లా బోల్' ర్యాలీ నిర్వహించబోతోంది. ఈ క్రమంలోనే కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ బీజేపీ సర్కారుపై విమర్శలు చేశారు. దేశంలో నిత్యావసరాల ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయనీ, దీని కారణంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న ధరల పెరుగుదల సమస్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రజా క్షేత్రంలో పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. “ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది. 2014 నుండి 2022 వరకు, నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగాయో మీరు పోల్చవచ్చు”అని వేణుగోపాల్ అన్నారు. పెరుగుతున్న ధరల సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం బీజేపీ సర్కారుపై విమర్శల దాడి చేశారు. "మేము భారతదేశం అంతటా సంతకాల ప్రచారాన్ని నిర్వహించాము. ధరల పెరుగుదలతో బాధపడుతున్న సామాన్య ప్రజల నుండి కోట్ల సంతకాలను సేకరించాము. వాటి వివరాలను మేము రాష్ట్రపతికి అందజేశాము" అని వేణుగోపాల్ అన్నారు.
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరగనున్న ప్రచారం దేశంలోనే అతిపెద్ద ర్యాలీలలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్న వేణుగోపాల్.. కేంద్రం బీజేపీయేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడంపై మాత్రమే దృష్టి సారిస్తూ ప్రజల ప్రశ్నలకు స్పందించడం లేదని ఆరోపించారు. "కేంద్ర ప్రభుత్వ సున్నితత్వం-చెడు విధానాల కారణంగా సామాన్య ప్రజల బాధను అనుభవించగలరు" అని ఆయన ఆరోపించారు. ధరల భారంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాప్రభుత్వం బాధపడటం లేదు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడంలో మాత్రమే బిజీగా ముందుకు సాగుతోందని విమర్శించారు. గత ఎనిమిదేళ్లలో కేంద్రం ఒక్క పన్నును మాత్రమే తగ్గించిందని, మోడీ ప్రభుత్వం తన క్రోనీ క్యాపిటలిస్ట్ స్నేహితులకు లబ్ధి చేకూర్చడం గురించి మాత్రమే ఆలోచిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ఆరోపించారు. "ఒకే పన్ను తగ్గించబడింది.. అది కార్పొరేషన్ పన్ను. పెట్టుబడిదారీ కుటుంబాలు చెల్లించాల్సిన పన్నును మాత్రమే 30% నుంచి 15-22%కి తగ్గించారు” అని ఆయన పేర్కొన్నారు.
