ఢిల్లీలోని ఘాజీపూర్ సరిహద్దుల్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఘాజీపూర్‌ ఆందోళణ స్థలాన్ని ఖాళీ చేయాలని రైతులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్‌తో పోలీసుల చర్చలు విఫలమయ్యాయి. సరెండర్ అయ్యేందుకు రాకేశ్ నిరాకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం పోరాడుతానని టికాయత్ స్పష్టం చేశారు. బుల్లెట్లనైనా ఎదుర్కొంటానని.. మమ్మల్ని చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదని రాకేశ్ స్పష్టం చేశారు. ఒకవేళ బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే ఉరి వేసుకుంటామని రైతులు అధికారులను హెచ్చరించారు. అయినప్పటికీ తాము బలవంతంగానైనా ఖాళీ చేయిస్తామని అధికారులు హెచ్చరించారు.

రైతులపై దాడి చేయొద్దని భారతీయ కిసాన్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. దేశ రాజధాని సరిహద్దు ప్రాంతమైన సింఘా వద్ద ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రైతులకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు.

ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. క్యాంప్‌లు ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. గణతంత్ర దినోత్సవం నాడు శాంతియుత ర్యాలీకి అనుమతి తీసుకుని విధ్వంసాలకు తెగబడ్డారు రైతులు.

దీంతో రైతులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాలు చేతబూనిన స్థానికులు తమ ప్రాంతం నుంచి రైతుల్ని తరిమేస్తామంటూ వచ్చారు. అయితే ఆందోళనకారుల్ని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.

సంయమనం పాటించాల్సిందిగా స్థానికులను కోరాయి. దీంతో సింఘూ బోర్డర్ వద్ద ఉద్రిక్త పరిస్ధితులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ రోజు రాత్రి లోపు సరిహద్దు నుంచి వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ రైతులను ఆదేశించారు.

స్వయంగా వెళ్లకపోతే బలవంతంగా చేయించాల్సి ఉంటుందని కలెక్టర్ ఆదేశాల్లో తెలిపారు. కాగా, ఇవాళ మరో రెండు రైతు సంఘాలు ఆందోళన విరమించాయి. ఆందోళన నుంచి వైదొలుగుతున్నట్లు కిసాన్ మహా పంచాయత్, భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించాయి. ఇప్పటికే రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, బీకేయూ సంఘాలు ఆందోళన విరమించాయి.