గాంధీనగర్: ప్రియుడి కోసం  ఓ ప్రియురాలు ఏకంగా తన ఇంట్లో నుండి కోటి రూపాయాలను దోచేసింది. అయితే ఇదంతా దొంగల పని అనేలా నమ్మించే ప్రయత్నం చేసి చివరకు  పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది.

గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్ భక్తినగర్‌లో  గీతాంజలి పార్క్‌ ప్రాంతంలో ప్రియాంక (20), గీత్‌ గుర్జారి సొసైటీలో ఉండే హెట్‌ షా (20) రెండేళ్లుగా ప్రేమించుకొంటున్నారు. 

హెట్‌ షాకు ప్రియాంక ట్యూషన్ క్లాస్‌లో  పరిచయమైంది. అయితే కమర్షియల్ పైలెట్ కావాలని హెట్ షా భావించాడు. అయితే  పైలెట్ కావాలంటే భారీగా డబ్బులను ఖర్చు చేయాల్సి వస్తోంది.

గుజరాత్ నుండి బెంగుళూరు ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో  హెట్ షా చేరాలనుకొన్నాడు. ఈ విషయాన్ని తన ప్రియురాలు ప్రియాంకకు వివరించాడు. కమర్షియల్ పైలెట్ కావడానికి  తన వద్ద  అంత డబ్బు లేదని చెప్పాడు. 

ప్రియుడు పరిస్థితి చూసి జాలిపడిన ప్రియురాలు ప్రియాంక తన ఇంటికే కన్నం వేసింది. గత నెల 29వ తేదీన  ఇంట్లో ఎవరూ కూడ లేని సమయంలో  రూ. 90 లక్షల విలువైన బంగారం, రెండు కిలోల వెండి వస్తువులతో పాటు రూ. 64 వేల నగదును దొంగలించి హేట్‌షా  చేతికిచ్చింది. ఇంట్లో దొంగతనం జరిగినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది.

ఇంట్లోని వస్తువులన్నీ చిందర వందర చేసింది. దొంగతనం చేశారనే అనుమానం కలిగేలా చేశారు.దొంగతనం జరిగిందని  భావించిన ప్రియాంక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ నిర్వహించారు. ఈ విచారణలో రెండో తాళం చెవితో దొంగతనం చేసినట్టు గుర్తించారు. ప్రియాంకపై పోలీసులు అనుమానించారు.

హేట్‌ షాతో ప్రియాంక ప్రేమ విషయం గుర్తించారు. హేట్‌షాను వెతికి అతని వద్ద నుండి  బంగారం, వెండి, నగదును తీసుకొచ్చారు. తమ కూతురే  ప్రియుడి కోసం ఇలా దొంగతనం చేసిందని  తెలిసి తల్లిదండ్రులు నివ్వెరపోయారు. కేసును వెనక్కి తీసుకొన్నారు.