చెన్నై:రాజకీయాల విషయంలో  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పునరాలోచన పడ్డారని ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా ఆయన రాసినట్టుగా చెబుతున్న లేఖ ఒకటి బయటకు వచ్చింది. అయితే ఈ లేఖ తాను రాసింది కాదని రజనీకాంత్ స్పష్టం చేశారు. అయితే  తన ఆరోగ్యం, డాక్టర్లు ఇచ్చిన సలహాలు మాత్రం నిజమేనని ఆయన ఒప్పుకొన్నారు.

ఈ విషయమై గురువారం నాడు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.సరైన సమయంలో రాజకీయాల విషయంలో 
సరైన సమయంలో ప్రకటిస్తానని రజనీకాంత్ ప్రకటించారు. అయితే రజనీ సహచరుడు  కమల్ హాసన్ పార్టీని ఏర్పాటు చేశాడు. 2019  లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కమల్ హాసన్ తన పార్టీ తరపున అభ్యర్ధులను కూడ బరిలోకి దింపారు.

రానున్న రోజుల్లో రజనీకాంత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ పార్టీకి చెందిన కొందరితో సమావేశాలు నిర్వహించనున్నారు. డిసెంబర్, జనవరి మొదటివారంలో  ఎన్నికల రాజకీయాల విషయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని రజనీకాంత్ సన్నిహితులు చెప్పారు.తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలకు 7 నెలల ముందుగా రజనీకాంత్ ప్రకటన వచ్చింది. తమిళ రాజకీయాల్లో సినీ నటులు విజయవంతమయ్యారు. 

రాజకీయాల గురించి రజనీకాంత్ పునరాలోచనలో ఉన్నట్టుగా ఓ లేఖ బుధవారం నాడు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కరోనాను దృష్టిలో ఉంచుకొని రజనీకాంత్ తన రాజకీయాల నుండి వైదొలగాలని భావిస్తున్నట్టుగా ఆ లేఖ ఉద్దేశ్యంగా కన్పిస్తోంది.

కిడ్నీ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నందున  ఎక్కువగా కదలకూడదని రజనీకాంత్ కు వైద్యులు సలహా ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తోందో రాదో తెలియదు. ఇప్పటికే మీరు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకొన్నారు. ఇతరులతో పోలిస్తే మీలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. 

ఈ సమయంలో మీరు ఎక్కువగా ప్రజలను కలవకూడదని వైద్యులు రజనీకాంత్ కు చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది. తన ఆరోగ్యం గురించి అంతగా చింతించాల్సి అవసరం లేదన్నారు. తన చుట్టూ ఉన్నవారి గురించే తన బాధ అని రజనీకాంత్ ఆ లేఖలో పేర్కొన్నారని సమాచారం.

2017 డిసెంబర్ 31న రాజకీయాల్లోకి ప్రవేశించాలనే తన ఉద్దేశాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించారు. 1996లో జయలలిత ఓటమికి రజనీ వ్యాఖ్యలు కూడ కారణమన్నారు.జయలలితకు తిరిగి ఓటు వేస్తే దేవుడు కూడ తమిళనాడును రక్షించలేడని ఆయన చెప్పారు.