పురిటి కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళకు గర్భశోకం మిగిలింది. డాక్టర్ కి బదులు ఒక మేల్ నర్స్( పురుషుడు) పురుడు పోయగా.. గర్భిణి కడుపులోనే బిడ్డ తల మిగిలిపోయింది. మొండం మాత్రం బయటకు వచ్చింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని రామ్ ఘడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ.. ప్రసవం కోసం రామ్ ఘడ్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో.. మేల్ నర్స్.. ఆమెకు పురుడు పోసాడు.. కడుపులో బిడ్డను బయటకు లాగే సమయంలో.. గట్టిగా లాగాడు. దీంతో.. బిడ్డ రెండు ముక్కలు అయ్యింది. తల మాత్రం మహిళ కడుపులోనే ఉండటం గమనార్హం.

శిశువు మొండెం భాగాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించి.. సదరు మహిళను మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు. మహిళ కడుపులో శిశువు తల ఉండిపోవడంతో డాక్టర్ రవీంద్ర శంఖ్లా ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఆమెకు శస్త్రచికిత్స చేసి తలను బయటకు తీశారు. కాగా.. ఈ ఘటన అందరినీ కలచేసి వేసింది. సదరు మహిళ భర్త ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.