తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమంటూ ప్రకటించేశారు. ఈ నెలాఖరికి తన పార్టీ పేరును కూడా ఆయన ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. 

కాగా.. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 8 నెలల పాటు చెన్నైకే పరిమితమైన రజనీకాంత్‌ రాజకీయాల్లో అడుగుపెట్టేముందు తన సోదరుడు సత్యనారాయణ ఆశీస్సులు తీసుకోవడానికి బెంగళూరు వెళ్లారు. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం ‘అణ్ణాత్తే’ షూటింగ్‌ను కూడా ముగించాలని రజనీ నిర్ణయించుకున్నారు. పార్టీ పేరు ప్రకటించే సమయానికి షూటింగ్స్ పూర్తి చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. 

ఈ నెల 15 నుంచి ఆయన ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రత్యేక విమానంలో 14న రజనీకాంత్‌ హైదరాబాద్‌కు వస్తారని సమాచారం. ఇక్కడ ఓ హోటల్‌లో ఉంటూ షూటింగ్‌లో పాల్గొంటారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో 45 రోజుల పాటు ఏకధాటిగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. అయితే అన్నిరోజుల పాటు రజనీ షూటింగ్‌లో పాల్గొననున్నారు

 ప్రస్తుతం రజనీకాంత్‌, ముఖ్య తారాగణంపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు మాత్రమే పెండింగ్‌ ఉన్నాయి. ముందుగా రజనీ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌లు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే సన్నివేశాలను కరోనా కంటే ముందే చిత్రీకరించారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఓ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ను కూడా సెట్స్‌లో ఉంచుతున్నారు.