Vande Bharat: ఇకమీదట వందే భారత్ రైళ్లు కాషాయ రంగులో కనిపించనున్నాయి. త్రివర్ణ పతాకం సూర్తిగా తీసుకుని వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు వేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది.
Vande Bharat: దేశవ్యాప్తంగా రైల్వే శాఖ వందేభారత్ రైళ్లను ఒకదాని తర్వాత ఒకటిగా ప్రారంభిస్తోంది . దీంతో పాటు రైల్వే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వందే భారత్ రైళ్లలో మార్పులు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ రైళ్లలో 25 మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు. రైల్వే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వందేభారత్ రైళ్లలో మార్పులు చేస్తున్నామని చెప్పారు. అలాగే.. కొత్త రైళ్లలో సేఫ్టీ ఫీచర్ యాంటీ-క్లైంబర్స్‌పై కూడా పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి తెలిపారు.
విశేషమేమిటంటే.. ఇప్పటివరకు మీరు వందే భారత్ రైలును నీలం, తెలుపు రంగులలో మాత్రమే చూడవచ్చు. ఇకమీదట కాషాయ రంగులో కనిపించనున్నాయి. వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు వేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. అంటే.. కొత్త వందే భారత్ రైలు ఆరెంజ్, వైట్ , బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో రానున్నాయి. వందేభారత్ రైలు కొత్త రంగును త్రివర్ణ పతాకం నుండి సూర్తిగా తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కొత్త వందే భారత్ రైలులో ఆరెంజ్ రంగు ప్రముఖంగా కనిపిస్తుంది. వైపు నుండి చూస్తే నలుపు , కాషాయం రంగులు కనిపిస్తాయి. రైల్వే మంత్రి కొత్త వందే భారత్ రైళ్ల ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు.
కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన రైల్వే మంత్రి
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం సందర్శించారు. ఈ ఫ్యాక్టరీలో వందేభారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. రైల్వే మంత్రి ఈ పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ.. వందేభారత్ రైలులో 25 మార్పులు చేశామని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తాము మార్పులు చేస్తున్నామనీ, ఇంకా చాలా విషయాలు చర్చించుకున్నామనీ, భద్రతా ఫీచర్ యాంటీ-క్లైంబర్స్‌పై కూడా పని చేస్తున్నామని తెలిపారు.
ఛార్జీలు తగ్గుతాయి
ఏసీ రైలు టిక్కెట్ల ఛార్జీలను తగ్గించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ రాయితీ ఛార్జీల పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వందేభారత్‌తో సహా ఏసీ చైర్‌కార్, ఏసీ సీటింగ్ సౌకర్యాలు ఉన్న అన్ని రైళ్ల ఛార్జీలు కోత విధిస్తారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి టికెట్ ధరలు 25 శాతం వరకు తగ్గనున్నాయి. ఇది తక్షణమే అమలులోకి వచ్చింది.
