కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జల్లికట్టు ఉత్సవాలను వీక్షించనున్నారు. పొంగల్ సందర్భంగా తమిళనాడు, మధురైలో ఒకరోజు పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా ఈనెల 14న అవనియపురంలో జరిగే 'జల్లికట్టు'ను ఆయన వీక్షిస్తారని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి తెలిపారు. 

మంగళవారం నాడు చెన్నైలో మీడియాతో కేఎస్ అళగిరి మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో మరిన్ని సార్లు రాహుల్ పర్యటనలను ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ రాహుల్ ఆరుసార్లు తమిళనాడు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 

మరిన్ని ఎక్కువ పర్యటనలను అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్లాన్ చేస్తున్నామని అన్నారు. వెస్ట్రన్ రీజియన్‌తో ప్రారంభించి, సౌత్, నార్త్, డెల్టా జిల్లాల్లో రాహుల్ పర్యటిస్తారని అన్నారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమిపై అళగిరి మాట్లాడుతూ, సీఎం అభ్యర్థిగా ఎంకే స్టాలిన్‌ను ఇప్పటికే ప్రకటించడం జరిగిందన్నారు. 

అన్నాడీఎంకేలో సీఎం అభ్యర్థిపై ఇప్పటికీ గందరగోళం నెలకొందని, అధికార పార్టీ నేతల మధ్యే విభేదాలున్నాయని చెప్పారు. సీఎం అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ఇప్పటికే మొదటి రౌండ్‌లో తాము గెలిచామని అన్నారు. 

భాగస్వామ్య పార్టీలకు తక్కువ సీట్లు ఇచ్చి, ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని డీఎంకే అనుకుంటుందన్న ఊహాగానాలపై మాట్లాడుతూ, ప్రతీ పార్టీ తమ కార్యకర్తలకు ఉత్సాహం కలిగించేందుకు ఇలాంటి మాటలు చెబుతుంటుందని, సీట్ల పంపకాలకు సంబంధించి చర్చలు మొదలైన తర్వాత బలాబలాల ఆధారంగా కేటాయింపులు జరుగుతాయని అన్నారు. సమస్య ఏదైనా ఉంటే అది అన్నాడీఎంకేలోనే ఉందని, తమ కూటమిలో లేదని అళగిరి చెప్పారు.