పంజాబ్ రాజకీయాలపై రాహుల్ గాంధీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం చన్నీ, నవజోత్ సింగ్ సిద్దూల మధ్య కొనసాగుతున్న పోటీకి ఆయన ఫుల్‌స్టాప్ పెట్టారు. సీఎం ఫేస్‌గా చన్నీని ఆయన ప్రకటించారు. అయితే, ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆయన ఈ సమస్యను కొలిక్కి తేవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇందులో ఆయన ప్రసంగం ఎంతో కీలకమైంది.
చండీగడ్: రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇటీవలే చాలా మంది దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఆయన ప్రసంగిస్తూ ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రసంగం హాట్ టాపిక్‌గా మారింది. పప్పు మరీ పప్పు ఏం కాదని అలా విమర్శించేవారూ మనస్సులో భావించారు. ఇదే తరుణంలో ఆయన రాహుల్ గాంధీ మరో సమస్యనూ సాల్వ్ చేశారు. కొంతకాలంగా పంజాబ్‌లో నానుతున్న జటిల సమస్యకు సులువుగా పరిష్కారం చూపారు. ఎట్టకేలకు పంజాబ్(Punjab Assembly Elections)లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని(Congress CM Face) రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందు ఆయన చేసిన ప్రసంగం చాలా మందిని ఆకర్షించింది.
రాజకీయ నేతలు కేవలం 10 నుంచి 15 రోజుల్లో పుట్టుకురారని రాహుల్ గాంధీ అన్నారు. టీవీ డిబేట్‌లలో పాల్గొన్నంత మాత్రానా లీడర్లు కారని తెలిపారు. పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ (CM Charanjit singh channi)ని ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయాన్ని తాను తీసుకోలేదని తెలిపారు. ఈ నిర్ణయం గురించి పంజాబ్ ప్రజలు, యువత, వర్కింగ్ కమిటీ సభ్యులదని అన్నారు. ‘నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు. కానీ, మీ అభిప్రాయాలే నాకు ఇష్టం. పేద ప్రజలను అర్థం చేసుకునే వ్యక్తి తమకు సీఎంగా కావాలని పంజాబ్ ప్రజలు కోరారు’ అని వివరించారు.
నవజోత్ సింగ్ సిద్దూ (Navjot singh sidhu)కు పరోక్షంగా మెస్సేజ్ ఇస్తున్నట్టుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాయకులను తయారు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఒక విధానం ఉన్నదని ఆయన సంకేతాలు ఇచ్చారు. నవజోత్ సింగ్ సిద్దూ 13 ఏళ్లు బీజేపీలో ఉండి 2017లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
‘నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కానీ, గడిచిన ఆరు ఏడు సంవత్సరాల్లో ఎక్కువగా నేర్చుకున్నాను. రాజకీయాలు చాలా సులభం అని భావించే వారి ఆలోచనలు శుద్ధ తప్పు. ప్రతి కదలికపై ఎంతో మంది కామెంట్లు చేస్తుంటారు. ఒక నేతగా ఎదగాలంటే అంత సులువు కాదు’ అని వివరించారు. అదే సందర్భంలో ఆయన నవజోత్ సింగ్ సిద్దూ, చరణ్ జిత్ సింగ్ చన్నీలతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. నవజోత్ సింగ్ సిద్దూను 40 ఏళ్ల క్రితం డూన్ స్కూల్‌లో కలిసినట్టు గుర్తు చేసుకున్నారు.
‘చన్నీ ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనకు పేదరికం గురించి ప్రత్యక్ష అనుభవం ఉన్నది. దాని గురించి లోతుగా తెలుసు కూడా. ఆయనలో ఎప్పుడైన అహంకారాన్ని మీరు చూశారా? ఆయన బేషజాలు లేకుండానే ప్రజల వద్దకు వెళ్లుతుంటాడు.. వారితో మమేకమైపోతుంటాడు. ఆయనది పేదల తరఫున గళం’ అని రాహుల్ గాంధీ అన్నారు. కాగా, సిద్దూ ఎమోషనల్ కావొచ్చు.. కానీ, దాని ద్వారా ఏం ఉపయోగం అంటూ సింపుల్‌గా ఆయనను సీఎం రేసు నుంచి తప్పించారు.
