నేషనల్ హెరాల్డ్ కేసులో ఈరోజు ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈరోజు ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చారు. దాదాపు మూడు గంటలపాటు ఈడీ అధికారులు.. రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అయితే రాహుల్‌కు భోజన విరామం ఇవ్వడంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ తుగ్లక్ లేన్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలతో ఇటీవల ఈడీ రాహుల్, సోనియాలకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే రాహుల్ ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఈడీ ఎదుట హాజరయ్యారు.
ఇక, రాహుల్‌ను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో.. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసలు చేపట్టింది. ఢిల్లీలో పలువురు ముఖ్య నేతలతో పాటుగా, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలను పోలసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించబడిన కాంగ్రెస్ కార్యకర్తలను ప్రియాంక గాంధీ కలిశారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బీజేపీ ఇలాంటి చర్యలు మానుకోవాలని లేకుంటే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబంపై ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారంటే.. బీజేపీ ఎంత కక్ష పూరితంగా వ్యవరిస్తుందో తెలుస్తుందని అన్నారు. ఈడీ కార్యాలయం నుంచి రాహుల్ గాంధీ బయటకు వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు.
