బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఎన్ని గంటలైనా కూర్చోబెట్టండి.. మోడీ, ఈడీకి తాను భయపడనని ... ప్రజా సమస్యల్ని విపక్షాలు పార్లమెంట్‌లో ప్రస్తావించకుండా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. 

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో అభద్రతా భావం పెరిగిపోయిందని, దేశంలో కేవలం ఇద్దరు మాత్రమే లాభపడుతున్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. లాభదాయక ప్రాజెక్ట్‌లన్నీ ఆ ఇద్దరికే దక్కుతున్నాయని.. ధరల పెరుగుదలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీ జనం జేబుల్ని లూటీ చేస్తున్నాడని.. పేదల నడ్డి విరుస్తున్నాడని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలో నిరుద్యోగ సమస్య కూడా పెరిగిపోయిందని.. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. 75 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారని.. కానీ ఈ స్థాయిలో ధరల పెరుగుదల ఎన్నడూ లేదని రాహుల్ స్పష్టం చేశారు. దేశ చరిత్రలో ఇంత ద్రవ్యోల్బణం ఎన్నడూ లేదని.. ఈడీ ఆఫీసులో తనను 25 గంటలు కూర్చోబెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని గంటలైనా కూర్చోబెట్టండి.. మోడీ, ఈడీకి తాను భయపడనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల్ని విపక్షాలు పార్లమెంట్‌లో ప్రస్తావించకుండా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.