Rahul Gandhi on Hijab: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిజాబ్ ధరించిన ముస్లీం విద్యార్థులకు మద్దతుగా నిలిచారు, దేశంలో విద్యార్థినీల‌ భవిష్యత్తును దోచుకుంటున్నార‌నీ కేంద్రంపై మండిప‌డ్డారు.   

Rahul Gandhi on Hijab: దేశంలో ఆడపిల్లల భవిష్యత్తును దోచుకుంటున్నార‌నీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్ధినులకు మద్దతుగా నిలిచారు. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్ధినులను అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కర్ణాటకలోని పలు కళాశాలల్లో హిజాబ్‌ ధరించడంపై వివాదం చెలరేగుతున్న త‌రుణంలో.....కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వారికి మద్దతు తెలిపారు. దేశంలో ఆడపిల్లల భవిష్యత్తు దోపిడికి గుర‌వుతుంద‌ని మండిపడ్డారు. సరస్వతీ దేవి ఎవరి పట్ల వివక్ష చూపించద‌ని, ఆమె అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తారని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి 4, 2022న.. కర్ణాటక ఉడిపి జిల్లాలోని కుందపురాలోని రెండు కళాశాలల్లో హిజాబ్‌ ధరించి రావడం నిబంధనలకు విరుద్ధం అని ముస్లిం విద్యార్ధినులను అధికారులు అనుమతించకపోవడం వల్ల వివాదం రేగింది. హిజాబ్ ధరించిన విద్యార్థులు తమ పాఠశాల వెలుపల కూర్చుని నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు.

గ‌తవారం రోజులుగా.. క‌ర్ణాట‌క‌లో హిజాబ్ వివాదం కొన‌సాగుతోంది. విద్యాసంస్థ‌ల్లో ముస్లీం విద్యార్థులు హిజాబ్ ధరించడం, హిందు విద్యార్థులు కాష‌య రంగు చున్నీని ధ‌రించ‌డంపై కర్ణాటక రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర నిషేధం విధించారు. విద్యార్థులు మతాచారాలు ఆచరించేందుకు పాఠశాలలకు రావద్దని, మన మతాలను అనుసరించడానికి, మనకు ప్రార్థనా స్థలాలు ఉన్నాయనీ, అక్క‌డ న‌చ్చిన ఆచారాన్ని పాటించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఇక నుంచి పాఠశాల, క‌ళాశాల విద్యార్థులు హిజాబ్, కాషాయం చున్నీలు ధరించకూడదని మంత్రి సూచించారు.

ఈ చ‌ర్య‌లు దేశ‌స‌మైక్య‌త‌ను దెబ్బ తీస్తున్నాయని అన్నారు. విద్యాల‌యాలంటే.. విద్యార్థులందరూ చదువుకునే ప్రాంతమని, మతాన్ని ఆచరించేందుకు ఎవరూ పాఠశాలకు రావద్దని మంత్రి కోరారు. అంద‌రూ కూడా ఒకే విధ‌మైన యూనిఫాంను ధ‌రించాల‌నీ, ఇలా చేయ‌డం వల్ల‌.. పిల్లలు తమ విభేదాలను మరచిపోయి.. వారంద‌రూ భారతీయులుగా ఏకం కావడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాల నిర్దేశించిన నిబంధనలను పాటించాలని సూచించిన విషయం తెలిసిందే.