ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులకు ఊరట కల్పించేవరకూ ప్రధాని నరేంద్ర మోదీని వెంటాడతానని హెచ్చరించారు. రైతు రుణమాఫీ విషయంలో మోదీని నిద్రపోనివ్వనని స్పష్టం చేశారు. 

మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతులకు రుణ మాఫీ ప్రకటించాయని, రాజస్ధాన్‌ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపట్టబోతోందని రాహుల్‌ తెలిపారు. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాల తరహాలో కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని రాహుల్ డిమాండ్‌ చేశారు. 

తమ పార్టీ ఇటీవల రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ఆరు గంటల్లోనే రైతు రుణాల మాఫీ ప్రకటించిందని, మూడో రాష్ట్రంలో కూడా రుణమాఫీకి కసరత్తు సాగుతోందన్నారు. రైతు రుణాల మాఫీ దిశగా ప్రధాని చర్యలు తీసుకునే వరకూ తాము ప్రధాని మోదీని విశ్రాం‍తి తీసుకోనియ్యమన్నారు. 

ప్రధాని మోదీ దేశాన్ని రెండుగా విడగొట్టారని, ఒక భారత్‌లో రైతులు, పేదలు, యువత, చిన్న వ్యాపారులుండగా, మరో భారత్‌లో కేవలం దేశంలోని పదిహేను మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సామాన్య ప్రజలతో కూడిన భారతీయులు పట్టం కట్టారని రాహుల్ స్పష్టం చేశారు.