సాధారణంగానే పెళ్లికి వెళితే వధూవరులను ఆశీర్వదించడంతోపాటు.. వారికి నగదు, లేదా ఇంకేదైనా బహుతులు అందిస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీగా వస్తూనే ఉంది. కాగా.. ఓ నూతన వధూవరులు మాత్రం ఈ విషయంలో చాలా భిన్నంగా ఆలోచించారు. తమకు బహుతులు వద్దని  కేవలం.. విరాళం ఇవ్వండి చాలు అంటూ రిక్వెస్ట్ చేశారు.

పెళ్లికి వచ్చిన అతిథుల నుంచి అందే మొత్తాన్ని కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు అందించేందుకు ఆ కుటుంబం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన చంఢిఘర్‌ నగరానికి 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న ముక్త్సర్‌ పట్టణంలో చోటుచేసుకుంది.  ఓ పంజాబీ కుటుంబం మంగళవారం పెళ్లి వేడుక నిర్వహించారు. 

అయితే వివాహానికి వచ్చిన అతిథులు బహుమతులకు బదులుగాడబ్బును అందజేయాలని కోరారు. అంతేగాక ఈ ఆలోచన వెనక అసలు కారణాన్ని వెల్లడించారు. వేడుకలో వచ్చిన డబ్బులను తాము ఉపయోగించకుండా.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు అందిస్తామని తెలిపింది.

రైతుల ఆహారం, బట్టలు వంటి అత్యవసర వస్తువులను అందించేదుంకు ఉపయోగిస్తామన్నారు. ఈ మేరకు వీడియో ద్వారా బంధువులు, స్నేహితులకు విన్నపించారు.  ఇందుకు పెళ్లి స్టేజ్‌ మీద విరాళ బాక్స్‌ను ఏర్పాటు చేశారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారీ ఎత్తున నిరసన తెలుపుతున్నారు. 

ఇవి కార్పొరేట్‌ సం‍స్థలకు అనుకూలంగా ఉన్నాయని, వెంటనే వీటిని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌చేస్తున్నారు. ఈ క్రమంలో ​కేంద్రం పలు మార్లు  రైతు సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయయ్యాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ రోజు సాయత్రం రైతులతో ఆరోసారి సమావేశమై రైతులకు కొత్త చట్టాలపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయనున్నారు.